ఐపీఎల్ 2027కు ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా పేరొందిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ ఇకపై కనిపించనుంది.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బిజీ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ కారణంగా తన పనిభారాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ESPNcricinfo వెల్లడించింది.
హెడ్ నిర్ణయంతో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అయితే వేలంలో ఆ జట్టుకు భారీగా డబ్బు అందుబాటులోకి రానుంది. 2025 మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. తాజాగా అతడిని విడుదల చేసేందుకు ఐపీఎల్ అనుమతి లభిస్తే.. ఆ రూ.14 కోట్లు జట్టు వేలం పర్స్‌కు జత కానున్నాయి.
డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. నవంబర్ 17వ తేదీ ఆటగాళ్ల రిటెన్షన్, విడుదలకు సంబంధించి ఫ్రాంచైజీలు నిర్ణయాలు వెల్లడించేందుకు చివరి తేదీగా ఉంది.
మరోవైపు 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లను విడుదల చేసినా, ట్రేడ్ చేసినా అప్పటి రిటెన్షన్ స్లాబ్‌ల ప్రకారమే జట్టు పర్స్‌లో మార్పులు ఉంటాయి. ఎస్‌ఆర్‌హెచ్ విషయానికి వస్తే.. హెడ్ విడుదలతో వచ్చే రూ.14 కోట్ల మినహా ఇతర మార్పులేమీ ఉండవు.
ఎందుకంటే అప్పట్లో నలుగురు క్యాప్డ్ ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు నిర్ణయించిన మొత్తం రూ.61 కోట్లు. ప్రస్తుతం హెడ్ మినహా జట్టులో ఉన్న మిగిలిన నలుగురు రిటెన్షన్ల జీతాలు కూడా కలిపి రూ.61 కోట్లుగా ఉన్నాయి. హెన్రిచ్ క్లాసెన్‌కు రూ.23 కోట్లు, పాట్ కమిన్స్‌కు రూ.18 కోట్లు, అభిషేక్ శర్మకు రూ.14 కోట్లు, నితీశ్ కుమార్ రెడ్డికి రూ.6 కోట్లు చెల్లిస్తున్నారు.
