బీజేపీలో చేరిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. ‘సూసేకి’ పాటతో ఫేమస్

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ మాజీ కంటెస్టెంట్ శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. సోమవారం తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు పలువురు కూడా ఈ సందర్భంగా భాజపాలో చేరారు.

యువత రాజకీయాల్లోకి రావడం హర్షణీయమని రామచందర్‌రావు అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న సమయంలో యువత రాజకీయాల్లోకి వచ్చి భాజపాలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు.

‘ఢీ’తో గుర్తింపు.. స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన శ్రష్టి వర్మకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి ఉంది. భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ‘తాజ్ మహోత్సవ్’ సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

టెలివిజన్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో కో-డ్యాన్సర్‌గా అవకాశం దక్కించుకున్న ఆమె.. తన ప్రతిభతో ‘ఢీ జోడీ’లోనూ పాల్గొన్నారు. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి.. ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

అనంతరం పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. ‘పుష్ప 2’లోని ‘సూసేకి’ పాటతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. అలాగే రజనీకాంత్ ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా’ పాటకు కూడా నృత్యరీతులు సమకూర్చారు.

‘క్రాక్’, ‘బీస్ట్’, ‘అల వైకుంఠపురములో’, ‘గేమ్ ఛేంజర్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, ‘మనమే’ తదితర చిత్రాలకు ఆమె పనిచేశారు. ‘బిగ్‌బాస్ 9’లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శ్రష్టి వర్మ.. భాజపాలో చేరడం సినీ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *