బిహార్‌లో ఘోర విషాదం.. ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు మృతి

బిహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. లఖిసరాయ్‌ జిల్లాలోని ప్రముఖ అశోక్‌ధామ్‌ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

శ్రావణమాసం సోమవారం కావడంతో అశోక్‌ధామ్‌ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తుల మధ్యలో విద్యుత్‌ వైర్‌ తెగిపడటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. విద్యుత్‌ షాక్‌ కొడుతుందనే భయంతో భక్తులు అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.

భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఆలయంలోని బారికేడ్లు కూలిపోయాయని లఖిసరాయ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ శైలేంద్ర కుమార్‌ తెలిపారు. దీంతో ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా అనే అంశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటనపై బిహార్‌ ముఖ్యమంత్రి సమ్రాట్‌ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన, సత్వర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు.

అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. అయితే భయాందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో బారికేడ్లు పడిపోయాయి. దీంతో తొక్కిసలాట జరిగింది. విద్యుత్‌ వైర్‌ తెగిపడటమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలను నిర్ధారించుకున్న తర్వాత వెల్లడిస్తామని లఖిసరాయ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ శైలేంద్ర కుమార్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *