ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్ షేర్లు స్టాక్ మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. NSEలో పేటీఎం షేరు 9.15 శాతం లాభంతో రూ.1,573.50 వద్ద ట్రేడైంది. ఒక్కరోజులోనే షేరు విలువ సుమారు రూ.131 పెరిగింది. పేటీఎం షేర్ల ర్యాలీకి ప్రధాన కారణం గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టీన్ టార్గెట్ ప్రైస్‌ను భారీగా పెంచడమే. గతంలో రూ.1,500గా ఉన్న టార్గెట్‌ను ఏకంగా రూ.2,200కు పెంచింది. అలాగే ‘Outperform’ రేటింగ్‌ను కొనసాగించింది.
శుక్రవారం ముగింపు ధరతో పోలిస్తే పేటీఎం షేరు మరో 52 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని బెర్న్‌స్టీన్ అంచనా వేసింది. 2021లో మార్కెట్‌లోకి వచ్చిన పేటీఎం షేరు ఇష్యూ ధర రూ.2,150గా ఉండగా.. ఇప్పటివరకు ఆ స్థాయిని అందుకోలేదు. అయితే తాజాగా బ్రోకరేజ్ సంస్థ ఇచ్చిన టార్గెట్ దానికంటే ఎక్కువగా ఉండటం ఇన్వెస్టర్లలో ఆసక్తిని పెంచింది.
ఇక UPI లావాదేవీలపై MDR ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే పేటీఎంకు ప్రయోజనం కలగవచ్చని బెర్న్‌స్టీన్ అంచనా వేసింది. 2027-28 ఆర్థిక సంవత్సరం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో పేటీఎం నికర పేమెంట్ మార్జిన్లు 3-4 బేసిస్ పాయింట్లు పెరగవచ్చని తెలిపింది.
అలాగే 2029-30 ఆర్థిక సంవత్సరానికి పేటీఎం ఎర్నింగ్స్ పర్ షేర్ (EPS) గత అంచనాలతో పోలిస్తే 30 శాతం వరకు పెరగవచ్చని బెర్న్‌స్టీన్ పేర్కొంది. అయితే డిజిటల్ లావాదేవీలపై ప్రతిపాదిత ఛార్జీలు కేవలం వ్యాపారులకే వర్తిస్తాయని, వినియోగదారులపై అదనపు భారం ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
