దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. దీంతో రోజంతా సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. సెన్సెక్స్ ఉదయం 78,501.59 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 78,676.98 వద్ద గరిష్ఠాన్ని, 78,298.92 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 43.27 పాయింట్లు లాభపడి 78,542.44 వద్ద స్థిరపడింది.

మరోవైపు నిఫ్టీ 13.15 పాయింట్లు పెరిగి 24,583.80 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.31 వద్ద ముగిసింది. రంగాల వారీగా చూస్తే రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

సెన్సెక్స్ 30లో టైటాన్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఎటర్నల్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర 84.33 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. ఔన్స్ బంగారం ధర 4,340.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *