టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల అనంతరం ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని, నటనకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారనే ప్రచారం మెగా అభిమానులను ఆందోళనకు గురిచేసింది.


అయితే ఈ ప్రచారానికి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అధికారికంగా చెక్ పెట్టింది. తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించిన సంస్థ.. పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేయబోతున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.


“మాటిచ్చినట్టుగానే ఆయన సినిమా చేస్తారు. ఆ సమయం ఎప్పుడనేది ఆయనే స్వయంగా ప్రకటిస్తారు. దర్శకుడు సుజీత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే ‘ఓజీ 2’ (#OG2) ప్రాజెక్ట్‌పై చర్చలు ప్రారంభిస్తామంటూ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది.


ఇదిలా ఉండగా, ‘ఓజీ’ తొలి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు దర్శకుడు సుజీత్ హీరో నానితో ‘బ్లడీ రోమియో’ చిత్రాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి.


ప్రస్తుతం సుజీత్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్‌తో సమావేశమై ‘ఓజీ 2’ కథా చర్చలు, షూటింగ్ షెడ్యూల్‌పై స్పష్టత తీసుకురానున్నట్లు తాజా ప్రకటన ద్వారా వెల్లడైంది.


దీంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరం కావడం లేదని, రాజకీయ బాధ్యతలు, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నారని స్పష్టమైంది. ఈ అధికారిక ప్రకటనతో గత కొద్ది గంటలుగా ఆందోళనలో ఉన్న మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *