ప్రముఖ నటి అవికా గోర్ డెంగ్యూ బారినపడి ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజులుగా 103–104 డిగ్రీల వరకు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ.. తన షూటింగ్ కమిట్‌మెంట్‌ను పూర్తి చేసినట్లు ఆమె భర్త మిలింద్ చంద్వానీ వెల్లడించారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అవికా ఆరోగ్య పరిస్థితిపై మిలింద్ చంద్వానీ వివరాలు వెల్లడించారు.
అవికాకు ఐదు రోజులుగా తీవ్ర జ్వరం ఉన్నప్పటికీ, పెండింగ్‌లో ఉన్న ఓ ప్రాజెక్ట్ షూటింగ్‌ను పూర్తి చేసిందని తెలిపారు. 104 డిగ్రీల జ్వరంతోనూ అవికా ఎంతో అంకితభావంతో షూటింగ్‌లో పాల్గొందని మిలింద్ చెప్పారు. వాస్తవానికి రెండు రోజుల షూటింగ్ మిగిలి ఉండగా.. ఆమె పరిస్థితిని చూసి చిత్ర బృందం ఒకే రోజులో షూటింగ్‌ను పూర్తి చేసిందని తెలిపారు.
షూటింగ్ పూర్తయిన తర్వాత అవికాకు రెండు రోజుల విరామం లభించిందని, ఆ సమయంలో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుందని మిలింద్ చెప్పారు. అయితే ఆ తర్వాత ఓ యాడ్ షూటింగ్ కోసం జ్వరంతోనే ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిందన్నారు.
ఇంట్లో ఉన్న సమయంలో అవికా మంచానికే పరిమితమైందని, మందులు తీసుకుంటూ కనీసం సరిగా తినలేకపోయిందని మిలింద్ తెలిపారు. అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం ఢిల్లీకి వెళ్లి యాడ్ షూటింగ్ పూర్తి చేసిందన్నారు. ఢిల్లీ వెళ్లే ముందు అవికాకు వైద్య పరీక్షలు చేయించారని, ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత రిపోర్ట్‌లో డెంగ్యూ ఉన్నట్లు నిర్ధారణ అయిందని మిలింద్ వెల్లడించారు. షూటింగ్‌ను వాయిదా వేయవచ్చని తాను పలుమార్లు చెప్పినా.. ఇతరులకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అవికా తన పని పూర్తి చేయాలని నిర్ణయించుకుందని తెలిపారు.
అవికా తన వృత్తిపై చూపుతున్న అంకితభావాన్ని మిలింద్ ప్రశంసించారు. ఇతరుల సమయం, డబ్బు వృథా కాకూడదనే ఆలోచనతో ఆమె ఇంతటి అనారోగ్య పరిస్థితుల్లోనూ పనిచేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. అవికా త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని కోరుతూ.. ఆమెపై తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
అవికా గోర్-మిలింద్ చంద్వానీ వివాహం
అవికా గోర్, మిలింద్ చంద్వానీ తమ ప్రేమ విషయాన్ని 2020లో బహిరంగంగా వెల్లడించారు. 2025 జూన్‌లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2025 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుకలు ‘పతి పత్ని ఔర్ పంగా’ రియాలిటీ షో సెట్స్‌లో నిర్వహించినట్లు సమాచారం.
