ఆహార ఉత్పత్తులపై ‘100%’ (100 Per Cent) అనే క్లెయిమ్‌లతో విక్రయాలు చేయొద్దంటూ భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) జారీ చేసిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ అమిత్ మహాజన్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
డాబర్ ఇండియా తరఫున వాదనలు విన్న కోర్టు.. సంస్థకు ముందుగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. తదుపరి విచారణ వరకు FSSAI ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
డాబర్ తరఫు న్యాయవాది.. ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా, తమ వాదనలు వినకుండా FSSAI నిర్ణయం తీసుకుందని కోర్టుకు తెలిపారు. దీనికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది.. గతంలోనే డాబర్‌కు ‘ఇంప్రూవ్మెంట్ నోటీసులు’, సూచనలు జారీ చేశామని, ఆహార ఉత్పత్తులపై ‘100%’ అనే క్లెయిమ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని వాదించారు.
అయితే కోర్టు స్పందిస్తూ.. “దశాబ్దాలుగా ఈ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా వాటిని అమ్మొద్దని చెప్పలేరని వ్యాఖ్యానించింది.
ఇటీవల FSSAI, డాబర్‌కు చెందిన తేనె, ఆవు నెయ్యి, యాపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నీరు, కొబ్బరి పాలు తదితర ఉత్పత్తులపై ‘100%’ అనే క్లెయిమ్‌లతో విక్రయాలు చేయడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
FSSAI ప్రకారం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్-2018 నిబంధనలకు ఈ తరహా క్లెయిమ్‌లు విరుద్ధం. ఇవి స్పష్టత లేనివిగా, ధ్రువీకరించలేనివిగా ఉండటంతో వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని పేర్కొంది.
