RBI: గోల్డ్ ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్: ఒకేసారి గ్రాముపై రూ. 9,700 పైగా లాభం!

 

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇన్వెస్టర్లకు తీపి కబురు అందించింది. గతంలో విడుదల చేసిన ‘SGB 2020-21 సిరీస్ XI’ బాండ్ల ముందస్తు ఉపసంహరణ (Premature Redemption)కు ఆర్‌బీఐ తేదీలను ప్రకటించి, విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఐదేళ్ల కాలపరిమితి పూర్తయిన సందర్భంగా, ఆగస్టు 7వ తేదీ నుంచే ఈ ముందస్తు విమోచన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.

గ్రాముపై ఏకంగా 199% లాభం:

ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టినవారికి భారీగా రాబడి దక్కింది. ఆర్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం:

  • కొనుగోలు ధర (2020-21): ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినవారికి గ్రాము ధర రూ. 4,862 (ఆఫ్‌లైన్ ఇన్వెస్టర్లకు రూ. 4,912).
  • ప్రస్తుత విమోచన ధర (2026): ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) బంగారం సగటు ధరల ఆధారంగా ప్రస్తుత విత్‌డ్రా ధరను గ్రాముకు రూ. 14,564గా ఆర్‌బీఐ నిర్ణయించింది.
  • మొత్తం లాభం: ఆన్‌లైన్ ఇన్వెస్టర్లకు గ్రాముపై ఏకంగా రూ. 9,702 లాభం లభిస్తుంది. అంటే దాదాపు 199.55% రాబడి దక్కింది.

రూ. 1 లక్ష పెట్టుబడికి రూ. 3 లక్షల రాబడి!

ఉదాహరణకు, 2021 ప్రారంభంలో ఈ సిరీస్ గోల్డ్ బాండ్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినవారికి, ఇప్పుడు ముందస్తు విత్‌డ్రా ద్వారా దాదాపు రూ. 3 లక్షలు తిరిగొస్తాయి.

దీనికి అదనంగా, ఇన్వెస్టర్లకు ఏడాదికి లభించే 2.50% స్థిర వడ్డీ (ప్రతి ఆరు నెలలకోసారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది) కూడా అదనపు ప్రయోజనంగా లభించింది.

ముందస్తుగా బాండ్లను నగదుగా మార్చుకోవాలనుకునే వారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని తమ లాభాలను స్వీకరించవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *