బెంగళూరులో భార్య హత్య కేసులో పరారైన యువకుడిని పోలీసులు బీహార్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జూలై 25న బెంగళూరులోని కుంబళగోడు ప్రాంతంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ధీరజ్ కుమార్ (24), రీమా కుమారి ప్రేమించి దాదాపు 10 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు తెలియకుండా బెంగళూరుకు వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది. రీమా ఎక్కువ సమయం సోషల్ మీడియా కోసం రీల్స్ చేయడం, తరచూ బీహార్‌కు తిరిగి వెళ్లాలని కోరుకోవడం వంటి అంశాలపై ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఇంటి పనులు, ఇతర కుటుంబ విషయాలపై కూడా తరచూ వాగ్వాదాలు జరిగేవని విచారణలో వెల్లడైంది.

జూలై 25న కూడా చిన్నపాటి గొడవ తీవ్రస్థాయికి చేరిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో ధీరజ్ తన భార్యను దుపట్టాతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటన అనంతరం నిందితుడు మృతదేహాన్ని గదిలోనే వదిలేసి బీహార్‌కు పారిపోయాడు. జూలై 29న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. సమాచారం అందుకున్న ఇంటి యజమాని గదిలోకి వెళ్లి చూడగా రీమా మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కేసు నమోదు చేసిన కుంబళగోడు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని బీహార్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం బెంగళూరుకు తీసుకొచ్చి విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో హత్యతో పాటు ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నించిన అభియోగాలపై కేసు నమోదు చేసిన పోలీసులు, మరిన్ని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *