ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయని, నైరుతి రుతుపవనాలు కూడా ముందుకు సాగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర-దక్షిణ ద్రోణి ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
అలాగే రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక నైరుతి రుతుపవనాల పురోగతిపై కూడా కీలక సమాచారం వెల్లడించింది.
మే 27 నాటికి రుతుపవనాలు అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలు, అలాగే బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Minuts news
Minutes news giving very wright and stright