హైదరాబాద్‌(Hyderabad)లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రముఖ ‘రాయల్ స్పైస్’(Royal Spice) రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఆందోళనకర పరిస్థితులు బయటపడ్డాయి. బయటకు విలాసవంతంగా కనిపించే ఈ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా కిచెన్‌లో పరిశుభ్రత పూర్తిగా లోపించినట్లు తేలింది.

వంటగదిలో పెద్ద ఎత్తున పురుగులు సంచరిస్తూ కనిపించగా, అక్కడి పరిస్థితులు అధికారులను విస్మయానికి గురిచేశాయి. వాష్ ఏరియా, కిచెన్, డైనింగ్ హాల్‌లలో ఎక్కడికక్కడ ఆహార వ్యర్థాలు పేరుకుపోవడంతో పాటు నీరు నిల్వ ఉండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లు గుర్తించారు.


అలాగే గోడలు, కిటికీలు తీవ్ర అపరిశుభ్ర స్థితిలో ఉండటంతో రెస్టారెంట్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వంటకాల తయారీలో అనుమతించిన పరిమితికి మించి రసాయనాలతో కూడిన ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఇవి వినియోగదారుల ఆరోగ్యానికి హానికరమని అధికారులు హెచ్చరించారు. ఇక ఆహార తయారీలో ఉపయోగిస్తున్న తాగునీటి నాణ్యతకు సంబంధించిన వాటర్ క్వాలిటీ సర్టిఫికెట్లను చూపించడంలో యాజమాన్యం విఫలమైంది. దీంతో రెస్టారెంట్‌లో వినియోగిస్తున్న నీటి నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.


మరోవైపు, వండుతున్న ఆహార పదార్థాల పక్కనే మూతలు లేని చెత్త డబ్బాలను ఉంచడం అధికారులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ పరిస్థితుల వల్ల ఆహారం సులభంగా కలుషితమై ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. ఆహార భద్రతా నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినందుకు రాయల్ స్పైస్ రెస్టారెంట్ యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

నిర్దేశిత ప్రమాణాలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ ఘటనతో గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లోని ఇతర హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలు రానున్న రోజుల్లో మరింత కఠినంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇచ్చారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *