కన్వర్ యాత్ర మార్గాల్లో నాన్‌వెజ్ ఆహారం విక్రయిస్తున్నారనే ఆరోపణలతో రెండు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
సావన్ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో యాత్ర మార్గాల్లో పోలీసులు, అధికారులు నిఘాను పెంచారు. యాత్రికులు వెళ్లే ప్రధాన మార్గాల్లో మాంసం, చికెన్, చేపలు తదితర నాన్‌వెజ్ ఆహార పదార్థాలను విక్రయించకూడదని అధికారులు ఇప్పటికే వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం బహేరీ ప్రాంతంలోని పాత రోడ్‌వేస్ బస్టాండ్ సమీపంలోని ఓ దుకాణంలో చికెన్ బిర్యానీ విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గతంలోనే హెచ్చరించినప్పటికీ దుకాణం కొనసాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. దుకాణదారులు సల్మాన్, రఈస్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు జేసీబీని అక్కడికి తీసుకువచ్చి దుకాణానికి ఏర్పాటు చేసిన టిన్ షెడ్, కౌంటర్‌ను తొలగించారు. ఈ విషయాన్ని బహేరీ సర్కిల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ఆ తర్వాత బేకరీ ప్రాంతం సమీపంలోని మరో దుకాణంపైనా పోలీసులు దాడి చేశారు. అక్కడ ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కన్వర్ యాత్ర సమయంలో నాన్‌వెజ్ ఆహారం విక్రయించకూడదని ఇప్పటికే వ్యాపారులను హెచ్చరించినప్పటికీ.. వారు నిబంధనలను ఉల్లంఘిస్తూ విక్రయాలు కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. బరేలీ-బహేరీ మార్గంతో పాటు ఇతర ప్రధాన కన్వర్ యాత్ర మార్గాల్లోనూ పోలీసులు నిఘాను మరింత పెంచారు. నిషేధిత లేదా నిర్దేశిత ప్రాంతాల్లో మాంసం, చికెన్, చేపల విక్రయాలను అడ్డుకునేందుకు తనిఖీలు కొనసాగుతున్నాయి.
సావన్ మాసంలో ప్రధాన కన్వర్ యాత్ర మార్గాల్లో నాన్‌వెజ్ విక్రయాలపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని సర్కిల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
