భారత సైన్యంలో నేపాల్ యువత నియామకాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత సైన్యం చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేపాల్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. అక్కడి గూర్ఖా మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు నిరసన చేపట్టారు. భారత సైన్యంలో నేపాల్ యువతను అగ్నిపథ్ పథకం కింద మళ్లీ నియమించాలని వారు డిమాండ్ చేశారు.

నేపాల్‌లోని పోఖరాలో ఆగస్టు 12న ఈ నిరసన జరిగింది. ఇండియన్ ఎక్స్-సర్వీస్‌మెన్ గూర్ఖా బ్రిగేడ్ నేపాల్ పోఖరా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళన.. పోఖరా స్టేడియం నుంచి కాస్కీ జిల్లా పరిపాలనా కార్యాలయం వరకు సాగింది. అనంతరం తమ డిమాండ్లతో కూడిన రెండు అంశాల మెమొరాండాన్ని ప్రభుత్వానికి సమర్పించారు.

ఏం డిమాండ్ చేస్తున్నారు?

భారత సైన్యంలో నేపాల్ యువతకు అగ్నిపథ్ పథకం కింద వెంటనే నియామకాలు ప్రారంభించాలని మాజీ గూర్ఖా సైనికులు కోరుతున్నారు. అలాగే ‘సైనికుడు’ అనే పదాన్ని పేరులో ఉపయోగించే మాజీ సైనికుల సంస్థల పునరుద్ధరణకు అనుమతించాలని డిమాండ్ చేశారు.

నిరసనలో పాల్గొన్న వారు ‘అగ్నిపథ్ కింద నేపాల్ యువతను భారత సైన్యంలో నియమించండి’, ‘హోం మంత్రిత్వ శాఖ లేఖను ఉపసంహరించండి’, ‘మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించండి’ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు.

బ్రిగేడ్ చైర్మన్ కల్నల్ కృష్ణ బహదూర్ ఖత్రి మాట్లాడుతూ.. సుగౌలి ఒప్పందం నాటి నుంచి కొనసాగుతున్న 200 ఏళ్లకు పైబడిన గూర్ఖా నియామకాల సంప్రదాయం ఇప్పుడు అగ్నిపథ్ కారణంగా సంక్షోభంలో పడిందని అన్నారు.

అగ్నిపథ్ పథకంపై నేపాల్ అభ్యంతరం ఏంటి?

భారత ప్రభుత్వం 2022లో సైనిక నియామకాల్లో మార్పులు తీసుకురావడానికి అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సైన్యంలో జవాన్లు, నావికులు, ఎయిర్‌మెన్ వంటి నాన్-ఆఫీసర్ స్థాయి సిబ్బందిని నాలుగేళ్ల కాలానికి నియమిస్తారు.

నాలుగేళ్ల తర్వాత పనితీరు, సంస్థ అవసరాల ఆధారంగా గరిష్ఠంగా 25 శాతం మంది అగ్నివీరులను మాత్రమే శాశ్వత సర్వీసులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. మిగిలిన వారికి సేవా నిధి మొత్తాన్ని చెల్లించి సర్వీసు నుంచి విడుదల చేస్తారు.

అయితే ఈ విధానం 1947లో భారత్, నేపాల్, బ్రిటన్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా లేదని నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నియామక విధానంలో ఇలాంటి మార్పులు చేయడానికి ముందు తమతో సంప్రదించాల్సి ఉందని నేపాల్ వాదించింది.

దీంతో 2022లో నేపాల్ నుంచి భారత సైన్యంలోకి కొత్త గూర్ఖా నియామకాలు నిలిచిపోయాయి.

నేపాల్ యువతకు ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయా?

భారత సైన్యంలో నియామకాలు నిలిచిపోవడంతో వందలాది మంది నేపాల్ యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని మాజీ గూర్ఖా సైనికులు చెబుతున్నారు.

గల్ఫ్ దేశాలకు వెళ్లి తక్కువ వేతనాలతో పనిచేయడం కంటే.. భారత సైన్యంలో అగ్నివీరుగా పనిచేయడం మెరుగైన అవకాశమని వారు అభిప్రాయపడుతున్నారు. నాలుగేళ్ల వ్యవధిలో వేతనాలు, ఇతర ప్రయోజనాలతో కలిపి గణనీయమైన మొత్తాన్ని సంపాదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

నేపాల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

గతంలో భారత సైన్యంలో పనిచేసిన నేపాల్ గూర్ఖా సైనికులు తమ కుటుంబాలకు పంపే డబ్బు నేపాల్ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూర్చేది. ప్రతి ఏడాది గూర్ఖా సైనికుల నుంచి వచ్చే రెమిటెన్సులు నేపాల్‌కు భారీగా చేరేవని మాజీ భారత రాయబారి రంజిత్ రే పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.

గూర్ఖా సైనికుల నుంచి వచ్చే ఈ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు వ్యాపారాలు, స్థానిక అభివృద్ధికి కూడా దోహదపడిందని పరిశోధనలు సూచిస్తున్నాయి.

రష్యా సైన్యంలో చేరుతున్న నేపాల్ యువత?

భారత సైన్యంలో అవకాశాలు నిలిచిపోవడంతో కొంతమంది నేపాల్ యువత ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా రష్యా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న నేపాల్ పౌరుల అంశం కూడా వెలుగులోకి వచ్చింది.

నేపాల్ ప్రభుత్వం అంచనాల ప్రకారం 200 మందికి పైగా నేపాల్ పౌరులు రష్యాకు వెళ్లి అక్కడి సైన్యంలో చేరినట్లు సమాచారం.

ఇక భారత సైన్యంలో గూర్ఖా నియామకాలను పునఃప్రారంభించాలా? లేదా అగ్నిపథ్ విధానాన్ని కొనసాగించాలా? అనే అంశంపై ఇప్పుడు నేపాల్ ప్రభుత్వ నిర్ణయం కీలకంగా మారింది. ఆగస్టు 16న భారత సైన్యం చీఫ్ నేపాల్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *