యాక్షన్ హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోగా అలరిస్తున్న ఆయన.. తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారారు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మకుటం’. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ చిత్రంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై విడుదలకు ముందు భారీ అంచనాలేర్పడ్డాయి.
మరి దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నం ఎలా ఉంది? ‘మకుటం’ ప్రేక్షకులను మెప్పించిందా? కథ, కథనం, నటన, టెక్నికల్ అంశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పూర్తి మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
మకుటం కథ ఏంటి?
కృప (విశాల్) నెలకు రూ.25 వేల జీతంతో పనిచేసే సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో కలిసి మధ్యతరగతి జీవితాన్ని కొనసాగిస్తుంటాడు.
పెళ్లికి ముందు మామగారితో తనకు కారు ఉందని కృప అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత ఎలాగోలా ఓ పాత బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి ఊటీకి వెళ్తాడు.
అయితే అక్కడ కృపను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చంపేందుకు ప్రయత్నిస్తారు. అసలు ఓ సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్‌ను చంపేందుకు వాళ్లు ఎందుకు ప్రయత్నించారు? కృప గతం ఏమిటి? అతనిలో దాగి ఉన్న లింగా ఎవరు? అన్నపూర్ణ (అంజలి)కి కృపతో ఉన్న సంబంధం ఏంటి? శత్రువుల నుంచి తన కుటుంబాన్ని కృప ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.
కథ, కథనం ఎలా ఉన్నాయి?
‘మకుటం’ కథను చూస్తే తెలుగు, తమిళ సినిమాల్లో గతంలో ఎన్నోసార్లు చూసిన రివెంజ్, ఫ్యాక్షన్ ఫార్ములా గుర్తుకు వస్తుంది. శత్రువుల నుంచి కొడుకును కాపాడేందుకు అతడిని దూరంగా పంపించి సాధారణ వ్యక్తిగా పెంచడం.. ఆ తర్వాత అతని అసలు గతం అనూహ్యంగా బయటకు రావడం వంటి అంశాలు కొత్తగా అనిపించవు.
కథలో కమర్షియల్ ఎలివేషన్లకు మంచి అవకాశం ఉన్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే ఆ స్థాయిలో ఆకట్టుకోదు. సినిమా ప్రారంభంలో వచ్చే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సన్నివేశాలు సహా చాలా సీన్లు నెమ్మదిగా, బోరింగ్‌గా సాగుతాయి. కథలో ప్రేక్షకుడిని ఆసక్తిగా ఉంచే ట్విస్టులు, కొత్తదనం పెద్దగా కనిపించవు. రొటీన్ డ్రామాకు తోడు కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడం మైనస్‌గా మారింది.
దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నంలో కథను, కథనాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాల్సి ఉండేది. కానీ టేకింగ్‌లో కూడా చెప్పుకోదగ్గ కొత్తదనం కనిపించదు.
విశాల్ నటన ఎలా ఉంది?
ఈ సినిమాలో విశాల్ ద్విపాత్రాభినయంలో తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించారు. కొడుకు పాత్రలో ఆయన సాధారణ లుక్‌తో కనిపించగా.. తండ్రి పాత్రలోని ఓల్డ్ ఏజ్ గెటప్ మాత్రం అంతగా ఆకట్టుకోదు. ఫ్లాష్‌బ్యాక్‌లో విశాల్ లుక్ గతంలో ఆయన నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. నటన పరంగా కూడా విశాల్ నుంచి కొత్తగా చూపించిన అంశం పెద్దగా కనిపించదు.
దుషారా విజయన్, అంజలి కథానాయికలుగా నటించినప్పటికీ.. వారి పాత్రలకు తగినంత ప్రాధాన్యత దక్కలేదు. జయప్రకాశ్, జాన్ విజయ్, ఝాన్సీ వంటి సీనియర్ నటీనటులు తమ పాత్రల్లో కనిపించినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో నటన మోతాదుకు మించినట్లుగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు పెద్దగా ప్లస్ కాలేకపోయాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వినిపించే లౌడ్ సౌండ్ కొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపిస్తుంది యాక్షన్ సీన్లలో కొత్తగా ఏదైనా చూపించాలనే ప్రయత్నం కనిపించినప్పటికీ.. అవి ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో లేవు. కొన్ని సన్నివేశాలు అసహనంతో పాటు నవ్వు తెప్పించేలా మారతాయి.
పాత పాటలకు విశాల్ వేసిన డాన్స్ స్టెప్పులు కూడా అంతగా సింక్ అయినట్లు అనిపించవు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ భారీగా ఖర్చు పెట్టిన విషయం తెరపై కనిపిస్తుంది. అయితే బలమైన కంటెంట్ లేకపోవడంతో ఆ గ్రాండియర్ పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు.
ఫైనల్‌గా..
దర్శకుడిగా విశాల్ తొలి ప్రయత్నం కావడంతో ‘మకుటం’పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రొటీన్ కథ, ఆసక్తికరంగా సాగని కథనం, పెద్దగా ఆకట్టుకోని టెక్నికల్ అంశాలు సినిమాకు మైనస్‌గా మారాయి. హీరోగా విశాల్‌కు ఉన్న ఇమేజ్‌ను ఉపయోగించుకునే కమర్షియల్ ఎలివేషన్లకు అవకాశం ఉన్నప్పటికీ.. వాటిని సరైన స్థాయిలో తెరపైకి తీసుకురావడంలో సినిమా విఫలమైంది.
మొత్తంగా.. ‘మకుటం’ పాత ఫార్ములా కథకు కొత్త మకుటం పెట్టే ప్రయత్నం చేసినా.. ఆ మకుటం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిందని చెప్పొచ్చు.

