మహబూబ్‌నగర్‌ జిల్లాలోని భూత్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట గురువారం అర్ధరాత్రి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. 44వ జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో దాన్ని తప్పించే క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి అరుణాచలం వెళ్తున్న ఈ బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గుంటూరుకు చెందిన శరణప్ప, లక్ష్మీదుర్గ, మహేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్‌ మాసన్న, టెక్నీషియన్‌ రాజేందర్‌ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన వారందరినీ మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

ప్రమాదం కారణంగా 44వ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో పోలీసులు సమీపంలోని పెట్రోల్‌ బంకు మీదుగా వాహనాలను దారి మళ్లించారు. ఈ విషయాన్ని భూత్పూర్‌ ఎస్సై నాగన్న తెలిపారు.

మహబూబ్‌నగర్‌లో చికిత్స

ప్రమాదంలో గాయపడిన సంగారెడ్డికి చెందిన సునీత, హైదరాబాద్‌కు చెందిన అక్షిత, సంతోషి, వెంకట్రామ్, రవికుమార్, సునీతాకుమారి, ప్రమోద్, సంతోష్, లింగంపల్లికి చెందిన ప్రేమలత, రమేష్, గండిపేటకు చెందిన మహేశ్వరి, తమిళనాడులోని వెల్లూరుకు చెందిన ప్రభు, రాజమహేంద్రవరానికి చెందిన సాయితేజ్, మియాపూర్‌కు చెందిన సుజాత, రాజేంద్రప్రసాద్, హేమలత తదితరులకు మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

క్షతగాత్రులను ఎస్పీ జానకి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *