స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్‌, పౌర రక్షణ విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 1,057 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 301 మందికి పోలీసు మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 664 మందికి పోలీసు మెరిటోరియస్‌ సర్వీస్‌ పతకాలు అందనున్నాయి.

301 మందికి గ్యాలంట్రీ మెడల్స్‌

గ్యాలంట్రీ పతకాలకు ఎంపికైన 301 మందిలో 197 మంది తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తున్న 51 మంది, ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది పోలీసులకు కూడా ఈ పతకాలు దక్కాయి. ప్రాణాలు, ఆస్తులను కాపాడటం, నేరాలను అరికట్టడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీసు సిబ్బందికి కేంద్ర హోంశాఖ ప్రతి ఏడాది ఈ పతకాలను అందజేస్తోంది.

తెలుగు రాష్ట్రాల పోలీసులకు పతకాలు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 21 మంది ఈసారి పతకాలకు ఎంపికయ్యారు. వీరిలో ఏడుగురికి గ్యాలంట్రీ మెడల్స్‌, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి. ఏపీకి చెందిన ఐజీలు గుడి విజయ్‌కుమార్‌, బలంకారి వెంకట రామిరెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.

హెడ్‌ కానిస్టేబుళ్లు కొర్లాన మహేశ్‌, పైడి శ్రీరామమూర్తి, అడారి హేమసుందరరావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్‌, ఆబోతుల అప్పలనాయుడు, రుతాల కన్నబాబు గ్యాలంట్రీ మెడల్స్‌కు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 15 మంది పతకాల జాబితాలో ఉన్నారు. వీరిలో ముగ్గురికి గ్యాలంట్రీ మెడల్స్‌, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు దక్కనున్నాయి.

తెలంగాణ అదనపు డీసీపీ జోగుల నర్సయ్య, ఎస్పీ ఆర్‌. జగదీశ్వర్‌రెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. జూనియర్‌ కమాండోలు బి. సత్యరావు, కె. సందీప్‌కుమార్‌, జె. వంశీకృష్ణ గ్యాలంట్రీ మెడల్స్‌కు ఎంపికయ్యారు.

21 మంది సీబీఐ అధికారులకు కూడా..

కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)లో పనిచేస్తున్న 21 మంది అధికారులకు కూడా ఈసారి పతకాలు ప్రకటించారు. వీరిలో ఆరుగురికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 15 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి. విశాఖపట్నం డీఎస్పీ (సీబీఐ)గా పనిచేస్తున్న సంజయ్‌కుమార్‌ సమాల్‌ రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *