చంద్రగిరి సమీపంలో ఏనుగుల హల్‌చల్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారంపై ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎర్రవారిపాలెం సమీపంలో సంచరిస్తున్న అడవి ఏనుగుల గుంపు కదలికలను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం కలగకుండా అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఏనుగుల గుంపులు రాత్రి వేళ అడవికి సమీపంలోని పంట పొలాల్లోకి వస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన సమాచారంపై పవన్ కల్యాణ్ ఆదివారం అటవీ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శేషాచలం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు రెండు గుంపులుగా తిరుగుతున్నట్లు అధికారులు పవన్ కల్యాణ్‌కు వివరించారు.

డ్రోన్లతో ఏనుగుల కదలికలపై నిఘా

ఏనుగులు ఏ మార్గాల్లో సంచరిస్తున్నాయో డ్రోన్ల సాయంతో గుర్తించాలని పవన్ కల్యాణ్ సూచించారు. సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ ప్రత్యేక గస్తీ నిర్వహించాలని చెప్పారు.

అడవికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని.. ముఖ్యంగా రాత్రి సమయంలో పొలాల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

లౌడ్‌స్పీకర్లు, మొబైల్ మెసేజ్‌లతో హెచ్చరికలు

ఏనుగుల సంచారం ఉన్న గ్రామాల్లో లౌడ్‌స్పీకర్లు, మొబైల్ మెసేజ్‌లు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. అవసరమైన చోట్ల ‘హనుమాన్’ బృందాలను రంగంలోకి దించి ప్రజల భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అటవీ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏనుగుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పంట నష్టానికి వెంటనే పరిహారం

ఏనుగుల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ తెలిపారు. అధికారులు పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేసిన వెంటనే అటవీ శాఖ ద్వారా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఏనుగుల సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖ అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

కుమ్కీ ఏనుగులతో 70 శాతం తగ్గిన మరణాలు

ఇదిలా ఉండగా.. అడవి ఏనుగుల సమస్యను ఎదుర్కొనేందుకు ‘కుమ్కీ’ ఏనుగులను రంగంలోకి దించడంతో రాష్ట్రంలోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో మానవ మరణాలు 70 శాతం తగ్గాయని పవన్ కల్యాణ్ ఆగస్టు 13న తెలిపారు. జాతీయ స్థాయి ప్రపంచ ఏనుగుల దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. మానవ-ఏనుగు సంఘర్షణను నియంత్రించడంలో తీసుకున్న చర్యలతో పంట నష్టం కూడా తగ్గిందని చెప్పారు.

కర్ణాటక ప్రభుత్వం సహకారంతో నాలుగు కుమ్కీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ చర్యలు ఏజెన్సీ ప్రాంతాల్లో సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *