ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఓ పాఠశాల వ్యాన్ను నిమ్తీతా-కటవా ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టింది.
రైల్వే గేటు తెరిచి ఉండటంతో వ్యాన్ పట్టాలు దాటుతున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో వ్యాన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, అధికారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.