భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో ఆదివారం అర్ధరాత్రి స్వల్ప భూ ప్రకంపనలు (Earthquake) నమోదవడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కొత్తగూడెం(Kothagudem), పాల్వంచ(Palvancha), బూర్గంపాడు(Burgampadu), భద్రాచలం(Bhadrachalam) పరిసర ప్రాంతాల్లో నేల స్వల్పంగా కంపించినట్లు స్థానికులు గుర్తించారు.


అధికారుల వివరాల ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.


అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో పలువురు నివాసితులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆకస్మికంగా భూమి కంపించడంతో కొంతసేపు ప్రజల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అధికారులు తెలిపారు.


ఇదిలా ఉండగా, మరోసారి భూకంపం సంభవించే అవకాశముందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. భూపొరల్లో చోటుచేసుకునే స్వల్ప కదలికల కారణంగా అప్పుడప్పుడు ఇలాంటి ప్రకంపనలు రావడం సహజమని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని, అనవసర భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *