బాలీవుడ్‌ నటి ‘ప్రీతి జింటా’ చాలా కాలం తర్వాత వెండితెరపైకి రాబోతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘Batwara 1947’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన పాత్రకు సంబంధించిన లుక్‌ టెస్ట్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు ప్రీతి జింటా. ఈ ఫొటోలో ప్రీతి జింటా సింపుల్‌ చీరలో ఎంతో సహజంగా కనిపించారు. చీర కొంగుతో తలను కప్పుకుని, చేతులకు బంగారు గాజులు ధరించి ఉన్న ఆమె లుక్‌ ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటో తన పాత్ర హమీదాను తొలిసారి చూసిన సందర్భాన్ని గుర్తు చేస్తోందని ప్రీతి తెలిపారు. ‘బట్వారా 1947 విడుదలకు ముందు.. ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకోవాలనుకున్నాను. హమీదాను తొలిసారి చూసిన లుక్‌ టెస్ట్‌ సమయంలో ఈ ఫొటో తీశారంటూ ఆమె సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. తన పాత్ర హమీదా గురించి ప్రీతి మాట్లాడుతూ.. చుట్టూ అంతా చీకటిగా కనిపించినప్పుడు మరోసారి చూడాలి.. బహుశా మనమే వెలుగై ఉండొచ్చనే భావన ఆమె పాత్రకు సరిపోతుందని పేర్కొన్నారు.

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ

‘Batwara 1947’తో ప్రీతి జింటా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నారు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. షబానా అజ్మీ, అలీ ఫజల్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1947లో జరిగిన భారత విభజన నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ముఖ్యంగా లాహోర్‌ నేపథ్యంలో కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

అస్గర్ వజాహత్ రచించిన ‘జిస్ లాహోర్ నై వెఖ్యా, ఓ జమ్యా ఈ నై’ అనే ప్రసిద్ధ నాటకం నుంచి ఈ చిత్రానికి ప్రేరణ పొందినట్లు సమాచారం. విభజన కాలం నాటి పరిస్థితులు, మానవ సంబంధాలు, భావోద్వేగాలను ప్రధానంగా చూపించే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘Batwara 1947’ ఆగస్టు 14, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

 

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *