ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్లు (జూడాలు) సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ స్టైఫండ్‌ను పెంచాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (APJUDA) డిమాండ్ చేసింది. ఆగస్టు 15లోగా ప్రభుత్వం నుంచి నిర్ణయం రాకపోతే.. ఆగస్టు 17 నుంచి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

ప్రస్తుతం ఆగస్టు 15 వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని జూడాలు నిర్ణయించారు. అదే సమయంలో ఆందోళనలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించనున్నట్లు APJUDA ప్రకటించింది.

రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించిన న్యాయబద్ధమైన, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని APJUDA కోరింది. ముఖ్యంగా స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది.

అలాగే సమ్మె సమయంలో డీఆర్‌పీ (DRP), పెరిఫెరల్ పోస్టింగ్స్‌ను నిలిపివేస్తామని APJUDA వెల్లడించింది. సాధారణ వైద్య సేవలకు అంతరాయం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే అత్యవసర వైద్య సేవలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు వస్తే గడువు ముగియకముందే చర్చలకు సిద్ధంగా ఉన్నామని జూడాలు స్పష్టం చేశారు. తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కోరారు.

ఆగస్టు 15లోగా స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే.. ఆగస్టు 17 నుంచి జూడాల ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని వైద్య సేవలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *