జార్ఖండ్‌లో 2024లో జరిగిన JSSC-CGL పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో పేపర్ లీక్ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చి.. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన రాష్ట్ర సీఐడీ దర్యాప్తు నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి.

సీఐడీ నివేదిక ప్రకారం.. JSSC-CGL ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా లీక్ అయి, పలువురికి చేరినట్లు పేర్కొంది. పేపర్ల కోసం డబ్బులు చెల్లించిన వారికి హజారీబాగ్, జంషెడ్‌పూర్, పాట్నా, పశ్చిమ బెంగాల్‌తో పాటు నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సమాధానాలు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఇంటర్నెట్‌ బంద్ చేసినా ఆగని లీక్

గతంలో పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఒకసారి JSSC పరీక్షను రద్దు చేశారు. అనంతరం 2024 సెప్టెంబర్ 21, 22 తేదీల్లో రీ-ఎగ్జామ్ నిర్వహించారు. మళ్లీ పేపర్ లీక్ కాకుండా జార్ఖండ్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

అయితే ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినా లీక్ ముఠా వెనక్కి తగ్గలేదని అభ్యర్థులు ఆరోపించారు. ఈసారి వాట్సాప్‌కు బదులుగా ల్యాండ్‌లైన్ ఫోన్ల ద్వారా సమాధానాలు చెప్పారని, కొందరికి ఫోన్‌లోనే సమాధానాలను డిక్టేట్ చేశారని ఓ అభ్యర్థి వెల్లడించారు.

“మాకు ప్రశ్నలు రాలేదు.. సమాధానాలు మాత్రమే అందాయి. పరీక్ష తర్వాత అవి సరైన సమాధానాలేనని నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన నివేదికను కోర్టుకు కూడా సమర్పించాం” అని అభ్యర్థి జీత్ కుమార్ తెలిపారు.

ఫొటోలో టైమ్‌స్టాంప్.. కీలక ఆధారంగా మారిన సమాచారం

జీత్ కుమార్‌తో పాటు మరికొందరు అభ్యర్థులు రాంచీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షకు ముందు సమాధానాలు అందినట్లు చెబుతున్న ఫొటోకాపీలను వారు ఆధారాలుగా చూపిస్తున్నారు.

వాటిలో ఒక ఫొటోపై 2024 సెప్టెంబర్ 22 ఉదయం 7:23 గంటల టైమ్‌స్టాంప్ ఉన్నట్లు తెలిపారు. ఈ ఫొటో జంషెడ్‌పూర్‌లోని బిష్ణుపూర్ ప్రాంతంలో తీసినట్లు లొకేషన్ వివరాలు సూచిస్తున్నాయని చెప్పారు. పరీక్ష ప్రారంభానికి ముందే సమాధానాలు అందినట్లు నిరూపించేందుకు ఇది కీలక ఆధారమని అభ్యర్థులు వాదిస్తున్నారు.

150 ప్రశ్నల్లో 120 లీక్‌ అయ్యాయా?

2025 మార్చిలో సీఐడీ దర్యాప్తును పూర్తి చేసినట్లు సమాచారం. ప్రారంభ నివేదికలో 150 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు లీక్ అయినట్లు సీఐడీ నిర్ధారించినట్లు వెల్లడైంది.

అయితే సీఐడీ నివేదిక సమర్పించిన కొద్దికాలానికే రాష్ట్ర ప్రభుత్వం దానిని పక్కన పెట్టి మరో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. రెండో దర్యాప్తులో పేపర్ లీక్ ఆరోపణలకు ఆధారాలు లేవన్నట్లుగా తేల్చి.. పరీక్షకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు సమాచారం.

JPSC పేపర్ లీక్‌తో మళ్లీ ఆందోళనలు

ఇదే సమయంలో జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) పరీక్షలో కూడా పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.

రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో విద్యార్థుల నిరసన 16వ రోజుకు చేరుకుంది. విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో నేతృత్వంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలపై ప్రభుత్వం, విద్యార్థి ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు.

విద్యార్థులతో చర్చల్లో పాల్గొన్న జార్ఖండ్ మంత్రి దీపికా సింగ్.. వారి ఆందోళనల్లో న్యాయం ఉందని తెలిపారు. విద్యార్థులు మంచి సూచనలు, సముచితమైన డిమాండ్లు చేశారని.. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *