దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దాఖలు చేసిన 94 పేజీలకు పైగా ఉన్న ఛార్జ్‌షీట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పేపర్ లీక్ అనేది చివరి నిమిషంలో జరిగిన ఘటన కాదని, నెలల ముందే పక్కా ప్రణాళికతో అమలు చేసిన కుట్ర అని CBI పేర్కొంది.
దర్యాప్తు ప్రకారం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నియమించిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులు తమ అధికారిక బాధ్యతలను దుర్వినియోగం చేసి ప్రశ్నపత్రాన్ని బయటకు లీక్ చేసినట్లు ఆరోపించింది.
ప్రశ్నపత్రం ఎలా లీక్ చేశారు?
CBI వివరాల ప్రకారం..
కొంతమంది నిపుణులు ప్రశ్నలను చిన్న కాగితాలపై (చిట్స్) రాసి బయటకు తీసుకెళ్లారు.
మరికొందరు ప్రశ్నలను కంఠస్థం చేసి, హోటల్‌కు వెళ్లిన తర్వాత వాటిని రాసుకున్నారు.
ఇంకొంతమంది NCERT పుస్తకాలలో సంబంధిత పేరాలను గుర్తు పెట్టి ప్రశ్నలను పునర్నిర్మించారు.
ఈ విధంగా బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రశ్నలను సేకరించి బయటకు చేరవేసినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
NTAలో భద్రతా లోపాలే ప్రధాన కారణం
CBI ఛార్జ్‌షీట్ ప్రకారం, NTA కార్యాలయంలోని భద్రతా లోపాలు కూడా పేపర్ లీక్‌కు దోహదపడ్డాయి.
రహస్య విభాగంలో CCTV రికార్డింగ్ కేవలం 20-25 రోజులపాటు మాత్రమే నిల్వ ఉండేది.
రహస్య విభాగంలో జరిగే కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడం.
నిపుణులు లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వస్తున్నప్పుడు ఫ్రిస్కింగ్ (తనిఖీలు) చేయకపోవడం.
ఈ కారణాల వల్ల ప్రశ్నలను బయటకు తీసుకెళ్లడం సులభమైందని CBI తెలిపింది.
బ్రోకర్ల నెట్‌వర్క్ ద్వారా లీక్
పేపర్‌ను బయటకు తీసుకువచ్చిన తర్వాత దానిని బ్రోకర్లు, కోచింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా పలు రాష్ట్రాలకు పంపించినట్లు దర్యాప్తులో తేలింది.
కొందరు అభ్యర్థులకు ప్రత్యేకంగా రివిజన్ క్లాసులు నిర్వహించి అసలు ప్రశ్నలనే చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.
టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు పంపినట్లు CBI గుర్తించింది.
ప్రశ్నపత్రాల కోసం రూ.4 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బు చేతులు మారినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.
23 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం
మే 3, 2026న నిర్వహించిన NEET-UG పరీక్షను, పేపర్ లీక్ వెలుగులోకి రావడంతో మే 12న NTA రద్దు చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారత వైద్య ప్రవేశ పరీక్షల చరిత్రలో ఇది అతిపెద్ద వివాదాల్లో ఒకటిగా నిలిచింది.
