ప్రముఖ ఇటాలియన్ సూపర్‌బైక్ తయారీ సంస్థ డుకాటి (Ducati) భారత మార్కెట్లో తన కొత్త Monster V2ను ఆగస్టు 10న విడుదల చేయనుంది. ఇటీవల ఈ బైక్‌కు సంబంధించిన డిజైన్ పేటెంట్ దాఖలు చేసిన డుకాటి, ఇప్పుడు అధికారిక లాంచ్‌కు సిద్ధమైంది.
కొత్త 890cc V2 ఇంజిన్
కొత్త Monster V2లో 937cc ఇంజిన్ స్థానంలో 890cc V2 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ను అందించారు. ఇదే ఇంజిన్ Panigale V2, Streetfighter V2, Multistrada V2 మోడళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజిన్ 111 హెచ్‌పీ పవర్, 91.1 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ను జతచేయనున్నారు.
4 కిలోలు తక్కువ బరువు
ఈ బైక్‌లో కొత్త మోనోకోక్ చాసిస్ను ఉపయోగించారు. అలాగే డబుల్-సైడెడ్ స్వింగ్ ఆర్మ్ను అందించడం వల్ల బైక్ బరువు సుమారు 4 కిలోలు తగ్గింది. కొత్త Monster V2 బరువు 175 కిలోలు (ఫ్యూయల్ లేకుండా) ఉండనుండగా, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ను కొనసాగించారు.
మరింత ఆకర్షణీయమైన డిజైన్
కొత్త Monster V2లో డుకాటి డిజైన్‌ను మరింత స్పోర్టీగా తీర్చిదిద్దింది. భారీ ఆకృతిలో ఫ్యూయల్ ట్యాంక్, కొత్త LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), స్లిమ్ టెయిల్ సెక్షన్, ట్విన్ రౌండ్ ఎగ్జాస్ట్ సైలెన్సర్లు ఈ బైక్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తున్నాయి.
ధర ఎంత ఉండొచ్చు?
ప్రస్తుతం విక్రయాల్లో ఉన్న Ducati Monster ధర రూ.13.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త Monster V2 ధర దీనికంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఈ బైక్‌కు Triumph Street Triple RS ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది.
