JSW ఎంజి మోటార్ ఇండియా (JSW MG Motor India) భారత మార్కెట్లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లైన ‘MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ (MG Cyberster Couture Edition)’, MG M9 కౌచర్ ఎడిషన్ (MG M9 Couture Edition) ప్రత్యేక ఎడిషన్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా (Gaurav Gupta)తో కలిసి రూపొందించిన ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు ప్రత్యేక డిజైన్, ప్రీమియం లగ్జరీ ఫినిష్‌తో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి మోడల్‌లో కేవలం 50 కార్లు మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ధరలు ఇవే

  • MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ ధర: రూ.87.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్)
  • MG M9 కౌచర్ ఎడిషన్ ధర: రూ.84.94 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

ఈ రెండు ప్రత్యేక ఎడిషన్‌లు తమ స్టాండర్డ్ వేరియంట్‌లతో పోలిస్తే రూ.4.99 లక్షలు అధిక ధరతో అందుబాటులోకి వచ్చాయి.

బుకింగ్‌లు, డెలివరీలు

ఈ ప్రత్యేక కార్లకు జూలై 20 నుంచే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. వినియోగదారులకు ఆగస్టు 10 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 14 నగరాల్లోని ‘MG సెలెక్ట్’ ప్రీమియం షోరూమ్‌లలో మాత్రమే ఈ కార్లు విక్రయించనున్నారు.

MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ ప్రత్యేకతలు

MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్‌లో తెలుపు రంగును బేస్‌గా తీసుకుని బాడీపై ఆకర్షణీయమైన ఆరెంజ్ స్ట్రీక్స్ అందించారు. బోనెట్‌పై * Serpent Infinity బ్యాడ్జ్‌లు, టోనో కవర్‌పై ప్రత్యేక ఎంబ్రాయిడరీ, ముందు-వెనుక భాగాల్లో గోల్డ్ ఫినిష్ MG లోగోలు ఈ ఎడిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

MG M9 కౌచర్ ఎడిషన్ హైలైట్స్

MG M9 కౌచర్ ఎడిషన్‌లో కూడా తెలుపు రంగుతో పాటు చార్కోల్ కలర్ స్ట్రీక్స్ అందించారు. ముందు బంపర్‌పై Serpent Infinity బ్యాడ్జ్, MG లోగోకు ఇరువైపులా పౌరాణిక రెక్కలున్న పాంథర్ ఆకారంలోని బ్రోచెస్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇంటీరియర్‌లో డ్యాష్‌బోర్డ్‌పై ‘Couture Edition బ్రాండింగ్’ ఇచ్చారు. అయితే మిగతా క్యాబిన్ డిజైన్ మాత్రం స్టాండర్డ్ MG M9 మోడల్‌ మాదిరిగానే కొనసాగుతుంది.

డిజైన్ మాత్రమే మారింది

ఈ రెండు కౌచర్ ఎడిషన్‌లలో డిజైన్ పరంగా మాత్రమే మార్పులు చేశారు. మెకానికల్ స్పెసిఫికేషన్లు మాత్రం స్టాండర్డ్ మోడల్‌లాగే కొనసాగుతున్నాయి.

MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్ పనితీరు

MG సైబర్‌స్టర్ కౌచర్ ఎడిషన్‌లో 77kWh బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ మోటార్ AWD సిస్టమ్ అందించారు. ఇది 510bhp పవర్, 725Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంది.

MG M9 కౌచర్ ఎడిషన్ పనితీరు

MG M9 కౌచర్ ఎడిషన్‌లో 90kWh బ్యాటరీ ప్యాక్, సింగిల్ మోటార్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) సెటప్ ఉంది. ఇది 245bhp పవర్, 350Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పూర్తి ఛార్జ్‌పై 548 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *