భారత ఆటో మొబైల్ రంగంలో మరో సంచలనానికి హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. హీరో అనుబంధ సంస్థ Surge Future Mobility అభివృద్ధి చేసిన Surge S32 ప్రపంచంలోనే తొలి ‘Category-Swapping Electric Vehicle (EV)’గా గుర్తింపు పొందింది.
ప్రత్యేకత ఏంటంటే.. అవసరాన్ని బట్టి కొన్ని నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మూడు చక్రాల ఆటోరిక్షాగా మారిపోతుంది. 2024లో జరిగిన హీరో వరల్డ్ (Hero World) ఈవెంట్‌లో ఈ కాన్సెప్ట్‌ను తొలిసారి ప్రదర్శించగా.. ఇప్పుడు ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తయ్యాక 2026 రెండో అర్థంలో భారత మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
ఒకే వాహనం.. రెండు ఉపయోగాలు
Surge S32తో ఒకే వాహనాన్ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. రోజువారీ ప్రయాణాలకు స్కూటర్‌గా వాడుకోవచ్చు. వ్యాపారం లేదా సరుకు రవాణా అవసరమైనప్పుడు ప్రత్యేక మూడు చక్రాల మాడ్యూల్‌కు అనుసంధానం చేసి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఆటోరిక్షాగా మార్చుకోవచ్చు. భారతదేశంలో L2-5 కేటగిరీ కింద నమోదైన తొలి వాహనం కూడా ఇదే.
మూడు వేరియంట్లు
S32 PV – ప్రయాణికుల రవాణా కోసం
S32 LD – తేలికపాటి సరుకు రవాణా కోసం
S32 HD – భారీ సరుకు రవాణా కోసం
ఈ వాహనం హీరో రూపొందించిన అధునాతన మాడ్యులర్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ (Advanced Modular Smart Electric Platform) ఆధారంగా తయారైంది.
ఆటో మాడ్యూల్ స్పెసిఫికేషన్లు
11 kWh బ్యాటరీ
13.4 HP ఎలక్ట్రిక్ మోటార్
గరిష్ట వేగం: 50 కిమీ/గంట
గరిష్ట లోడ్ సామర్థ్యం: 500 కిలోలు
వాణిజ్య అవసరాలు, సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
స్కూటర్ స్పెసిఫికేషన్లు
3.5 kWh రిమూవబుల్ బ్యాటరీ
4 HP ఎలక్ట్రిక్ మోటార్
గరిష్ట వేగం: 60 కిమీ/గంట
నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు.
స్కూటర్ నుంచి ఆటోగా ఎలా మారుతుంది?
Surge S32లోని మాడ్యులర్ టెక్నాలజీ దీని ప్రధాన ఆకర్షణ. మూడు చక్రాల మాడ్యూల్ ముందు భాగంలోని విండ్‌షీల్డ్‌ను పైకి లేపి స్కూటర్‌ను అందులో అమర్చితే.. అది క్షణాల్లో ఆటోరిక్షాగా మారిపోతుంది. స్కూటర్‌లోని LED హెడ్‌ల్యాంప్‌లు ఆటో హెడ్‌లైట్లుగా పనిచేస్తాయి. వాహన నియంత్రణ మొత్తం స్కూటర్ ద్వారానే జరుగుతుంది.
ఎప్పుడు మార్కెట్లోకి?
ప్రభుత్వ అనుమతులు పూర్తయిన తర్వాత 2026 రెండో అర్థంలో భారత మార్కెట్లో Surge S32ను విడుదల చేయాలని హీరో లక్ష్యంగా పెట్టుకుంది. వ్యక్తిగత ప్రయాణాలు, వాణిజ్య అవసరాలు రెండింటినీ ఒకే వాహనంతో తీర్చే ఈ EV భారత మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశముంది.
