మాజీ తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు 2013లో తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం చేసిన కేసులో బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం సంచలన తీర్పు వెలువరించింది. 2021లో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషి తీర్పును రద్దు చేస్తూ, తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ ఎస్. జంసందేకర్ ట్రయల్ కోర్టు తీర్పును “వక్రీకృతమైన (Perverse) తీర్పు”గా అభివర్ణించారు. విచారణ సమయంలో బాధితురాలిపై అనవసరంగా వ్యక్తిగత జీవితం, గత సంబంధాలు, సోషల్ మీడియా పోస్టులు వంటి అంశాలపై ప్రశ్నలు అడిగి ఆమెనే విచారణలో నిలబెట్టినట్లు కోర్టు తీవ్రంగా విమర్శించింది.

దాదాపు 1,000 పేజీల క్రాస్ ఎగ్జామినేషన్‌లో అత్యాచార ఘటనకు సంబంధించి పదేపదే వ్యక్తిగత వివరాలనే ప్రశ్నించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాధితురాలి వాంగ్మూలంలోని నిజానిజాలను పరీక్షించడం కంటే, ఆమె చెప్పిన విషయాల్లో వైరుధ్యాలు వెతకడానికే ప్రయత్నించారని పేర్కొంది.

2013లో జరిగిన ఘటనకు సంబంధించి 2018 నుంచి 2021 మధ్య సాక్ష్యాలను నమోదు చేసినప్పటికీ, ఐదేళ్ల తర్వాత కూడా బాధితురాలిని అదే ఘటనపై పదేపదే ప్రశ్నించడం న్యాయసమ్మతం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మహిళల గౌరవాన్ని కాపాడే విధంగా విచారణలు జరగాల్సిన అవసరాన్ని హైకోర్టు మరోసారి గుర్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *