బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం చాలామంది గోల్డ్ లోన్ (Gold Loan) వైపు మొగ్గు చూపుతున్నారు. పసిడి విలువ పెరగడంతో బ్యాంకుల్లో లోన్ లిమిట్ కూడా ఎక్కువగా లభిస్తోంది. అయితే, అనుకోని పరిస్థితుల్లో లోన్ వాయిదాలు (EMIs) లేదా వడ్డీ సరిగ్గా చెల్లించలేకపోతే “తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వెంటనే వేలం వేస్తాయా?” అనే భయం చాలామందిలో ఉంటుంది. కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం రుణగ్రహీతలకు తగిన సమయం మరియు రక్షణ లభిస్తాయి.
90 రోజుల గడువు – ఎన్పీఏ (NPA) ప్రాసెస్
మీరు వాయిదాలు చెల్లించడంలో విఫలమైనా బ్యాంకులు వెంటనే వేలం ప్రక్రియను ప్రారంభించవు.
- 90 రోజుల రూల్: వరుసగా 90 రోజుల పాటు వాయిదాలు లేదా వడ్డీ చెల్లించకపోతే మాత్రమే ఆ రుణ ఖాతాను ‘నిరర్థక ఆస్తి’ (NPA – Non-Performing Asset) గా ప్రకటిస్తారు.
- ఖాతా ఎన్పీఏగా మారిన తర్వాత మాత్రమే వేలం వేసే చట్టపరమైన ప్రక్రియలు మెుదలవుతాయి. ఇది సుదీర్ఘమైన ప్రాసెస్ కాబట్టి అకస్మాత్తుగా వేలం నిర్వహించడం సాధ్యపడదు.
వేలం వేయడానికి ముందు బ్యాంకులు ఏం చేస్తాయి?
వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఆర్బీఐ పారదర్శక నిబంధనలను రూపొందించింది. వేలానికి వెళ్లేముందు బ్యాంకులు ఈ క్రింది చర్యలు తీసుకుంటాయి:
- రిమైండర్లు & నోటీసులు: మొదట ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ ద్వారా రిమైండర్లు పంపుతారు.
- ఒక నెల ఆఖరి గడువు: అప్పు చెల్లించడానికి రీజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసు పంపి ఒక నెల గడువు ఇస్తారు.
- వేలం వివరాల వెల్లడి: చివరిగా వేలం నిర్వహించే తేదీ, సమయం మరియు ప్రదేశాన్ని స్పష్టంగా పేర్కొంటూ నోటీసు ఇస్తారు. మీ ప్రమేయం లేదా సమాచారం లేకుండా బంగారం వేలం వేయడం కుదరదు.
చెల్లించలేని పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి?
ఒకవేళ మీరు ఆర్థిక సమస్యల్లో ఉండి లోన్ కట్టలేని పరిస్థితి వస్తే వెంటనే మీ బ్యాంకును సంప్రదించి పరిస్థితిని వివరించాలి. బ్యాంకులు మీకు ఈ క్రింది ప్రత్యామ్నాయ అవకాశాలను అందిస్తాయి:
- రుణ కాలపరిమితి పెంపు: EMIల గడువును పొడిగించడం.
- రీస్ట్రక్చరింగ్ / రీన్యూవల్: పాక్షికంగా (కోంతమొత్తం) డబ్బు చెల్లించి లోన్ రీన్యూవల్ చేసుకోవడం.
- టాప్-అప్ లోన్: కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే ‘టాప్-అప్’ సదుపాయాన్ని కూడా ఇస్తాయి.
ముగింపు: గోల్డ్ లోన్ రికవరీ విషయంలో వేలం అనేది బ్యాంకులు ఎంచుకునే చివరి మార్గం మాత్రమే. కాబట్టి నోటీసులు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా బ్యాంకు అధికారులతో మాట్లాడి సమస్యను సజావుగా పరిష్కరించుకోవచ్చు.
