గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ శరవేగంగా పుంజుకుంటున్నాయి. గత మూడు రోజులుగా పసిడి రేట్లు వరుసగా పెరుగుతుండటంతో వినియోగదారులు, కొనుగోలుదారులలో మళ్లీ ఆందోళన మొదలైంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు గ్లోబల్ మార్కెట్ సంక్షోభాలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు పసిడి వైపు మొగ్గు చూపడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం బంగారం, వెండి రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
మూడు రోజుల్లో పసిడి, వెండి ధరలు అనూహ్యంగా పెరిగాయి. సోమవారం నుంచి లెక్కిస్తే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై ఏకంగా రూ. 3,000 పైగా పెరిగింది. ఒక్క బుధవారం నాడే రూ. 2,300 వరకు పెరగ్గా, తాజాగా గురువారం కూడా స్వల్ప పెరుగుదల నమోదైంది. మరోవైపు వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ మూడు రోజుల్లో కిలోపై దాదాపు రూ. 7,000 మేర ప్రియమైంది.
దేశీయంగా పసిడి రేట్లను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 10 పెరిగి రూ. 1,46,520 కి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 10 పెరిగి రూ. 1,34,310 గా నమోదైంది. వెండి కిలో ధరపై రూ. 100 పెరగడంతో దేశీయంగా కిలో వెండి రూ. 2,40,100 వద్ద కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో ధరలను గమనిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, ముంబై మరియు బెంగళూరులలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,46,520 గానూ, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,34,310 గానూ నమోదైంది. ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,46,570 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1,34,460 వద్ద ఉన్నాయి.
వెండి విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖ మరియు చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,45,100 గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,40,100 లుగా నమోదు కావడం గమనార్హం. స్థానిక పన్నులు, ప్రాంతీయ డిమాండ్ మరియు సరఫరా వ్యత్యాసాల ఆధారంగా వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లలో ఈ స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి.
