కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విషాద ఘటనలో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే.. వారి కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడాన్ని ఎలా తప్పుబడతారని ప్రశ్నించింది.
మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కరూర్‌లో గతేడాది సెప్టెంబరులో నటుడు విజయ్ పాల్గొన్న టీవీకే (TVK) సభలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై పోలీసులు పలు ఆరోపణలు చేశారు. విజయ్ ఆలస్యంగా రావడంతో సభా ప్రాంగణంలో జనసందోహం భారీగా పెరిగిందని, తాగునీరు, ఆహారం, మరుగుదొడ్ల వంటి సదుపాయాలు కూడా తగినంతగా లేవని పేర్కొన్నారు. అయితే టీవీకే ఈ ఆరోపణలను ఖండించింది. పోలీసుల వైఫల్యం వల్లే ఘటన జరిగిందని ఆరోపించింది. మాజీ డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ కుట్ర చేశారంటూ కూడా ఆరోపణలు చేయగా.. ఆయన ఆ ఆరోపణలను ఖండించారు.
ఉద్యోగాలు ఇవ్వడంలో తప్పేంటి?
జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం.. ‘తొక్కిసలాట జరిగింది.. ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వారికి కొంత సాయం చేయాలని నిర్ణయిస్తే.. ఉద్యోగం ఇవ్వకూడదని ఎలా ప్రశ్నిస్తారు? కుటుంబానికి ఆధారమైన ఏకైక వ్యక్తి మరణిస్తే.. అతని కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వకూడదా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది?
మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జూలై 27న మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు)కు ఈ నిర్ణయం విరుద్ధమని హైకోర్టు పేర్కొంది.
ఇలాంటి నిర్ణయం భవిష్యత్తులో మరింత మంది ప్రభుత్వ ఉద్యోగాలను కోరేందుకు దారితీస్తుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారి అవసరాలను విస్మరించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే అంతకుముందు జూలైలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొక్కిసలాటలో మరణించిన 32 మంది బాధితుల చట్టబద్ధ వారసులకు కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో భాగంగానే ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
