నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సులభతరమైన ఈఎంఐ (EMI) పద్ధతిలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, రుణాలు తీసుకుని గ్యాడ్జెట్లు కొనే వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సంచలన హెచ్చరిక జారీ చేసింది. EMI చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎదురయ్యే పరిణామాలపై కఠినమైన నూతన నిబంధనలను ప్రకటించింది.
వచ్చే ఏడాది నుంచి కొత్త నిబంధనలు:
తీసుకున్న లోన్ వాయిదాలను క్రమబద్ధంగా చెల్లించేలా ప్రోత్సహించడానికి ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సమాచారం ప్రకారం, ఈ కొత్త రూల్స్ 2027 జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
EMI మిస్సయితే డివైజ్ లాకింగ్ నిబంధనలు:
- 30 రోజుల వ్యవధి: వినియోగదారుడు మొదటి ఈఎంఐ చెల్లించకుండా 30 రోజులు గడువు దాటితే, సంబంధిత ఫైనాన్స్ సంస్థలు ఆ డివైజ్‌ను పాక్షికంగా లాక్ చేసేందుకు అనుమతి ఉంటుంది.
- 60 రోజుల వ్యవధి: చెల్లింపు జరగకుండా గడువు 60 రోజులకు చేరుకుంటే, ఆ పరికరాన్ని పూర్తిగా లాక్ చేస్తారు.
లాక్ అయినా పనిచేసే సేవలు:
డివైజ్ పూర్తిగా లాక్ అయినప్పటికీ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఆర్‌బీఐ కొన్ని మినహాయింపులు ఇచ్చింది:
- ఇన్‌కమింగ్ కాల్స్ స్వీకరించడం మరియు ఎస్‌ఎంఎస్‌లు పొందడం.
- ఎమర్జెన్సీ (అత్యవసర) కమ్యూనికేషన్ సదుపాయాలు.
- ఉపాధి లేదా పనికి సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లు యథావిధిగా పనిచేస్తాయి.
డేటా ప్రైవసీపై స్పష్టత:
డివైజ్‌ను రిమోట్‌గా లాక్ చేసే క్రమంలో కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఫైనాన్స్ సంస్థలకు లేదా లెండర్లకు వినియోగదారుల వ్యక్తిగత డేటా యాక్సెస్ ఉండదు. కేవలం పరికరం పనితీరును మాత్రమే సాంకేతికంగా నియంత్రిస్తారు తప్ప వ్యక్తిగత డేటాను సేకరించలేరు.
ఫైనాన్స్ రూపంలో గ్యాడ్జెట్లు కొనుగోలు చేసే వినియోగదారులు ఇకపై ఈఎంఐ సమయానికి చెల్లించేలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
