గుజరాత్(Gujarat)లోని అహ్మదాబాద్‌ను భారీ పేలుడు కుదిపేసింది. నగర శివారులోని రామోల్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న బాణసంచా కర్మాగారం(Firecracker factory)లో ఒక్కసారిగా సంభవించిన పేలుడులో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫ్యాక్టరీ లైసెన్సు ఇప్పటికే రద్దయినప్పటికీ, అక్కడ రహస్యంగా బాణసంచా తయారీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ యూనిట్లో భారీ పేలుడు సంభవించడంతో భవనం ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
