విశాఖపట్టణం(Visakhapatnam)లోని స్టీల్ ప్లాంట్(Steel plant)లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్-2 (స్టీల్ మెల్టింగ్ షాప్-2) విభాగంలో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అలాగే కొంతమంది కార్మికులు ఇంకా లోపలే చిక్కుకుపోయినట్లు తెలుస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం అనంతరం ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో గతంలో కూడా పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగిన ఘటన జరిగింది. అయితే అప్పట్లో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే ఈసారి జరిగిన ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
