జయజయధ్వానాల నడుమ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. ప్రభుత్వ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బల్కంపేట ఎల్లమ్మ తల్లి దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మోతతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల జయజయధ్వానాల నడుమ ఉదయం 11:59 గంటల సుముహూర్తానికి అమ్మవారి కల్యాణాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించారు.

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ

ఈ దివ్య వేడుకలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీతారెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి శేషవస్త్రాలు తొడిగి, వేదాశీర్వచనం అందించారు.

 

భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాం – మంత్రి కొండా సురేఖ “రాష్ట్ర ప్రజలంతా శాంతి, సుభిక్షం, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను. కళ్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది.”

రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ “తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో పయనించాలని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని వేడుకున్నాను.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *