అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ భారత్‌లో తమ నాలుగో క్లౌడ్ రీజియన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు గురువారం ప్రకటించింది. ‘ఇండియా సౌత్ సెంట్రల్’ పేరుతో ప్రారంభమైన ఈ కొత్త క్లౌడ్ కేంద్రం ద్వారా దేశీయ సంస్థలు తమ డేటా, క్లౌడ్ సేవలను స్థానిక డేటా సెంటర్ల నుంచే నిర్వహించుకునే అవకాశం కల్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇప్పటికే ముంబయి (వెస్ట్ ఇండియా), పుణె (సెంట్రల్ ఇండియా), చెన్నై (సౌత్ ఇండియా)లో క్లౌడ్ రీజియన్‌లను నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్.. తాజాగా హైదరాబాద్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో దేశంలోనే అత్యంత విస్తృతమైన హైపర్‌స్కేల్ క్లౌడ్ మౌలిక వసతులు కలిగిన అంతర్జాతీయ సంస్థగా నిలిచింది.
రూ.1.95 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగం
భారత్‌లో డిజిటల్, కృత్రిమ మేధ (AI) మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.95 లక్షల కోట్ల) భారీ పెట్టుబడి ప్రణాళికలో భాగంగానే హైదరాబాద్ క్లౌడ్ రీజియన్‌ను నిర్మించింది. ఈ క్లౌడ్ రీజియన్‌లో మూడు Availability Zones ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల అత్యంత కీలకమైన అప్లికేషన్‌లు అధిక వేగంతో, ఎటువంటి అంతరాయం లేకుండా పనిచేసేలా మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి.
జీరో వాటర్ కూలింగ్ టెక్నాలజీ
2030 నాటికి Water Positive Companyగా మారాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ఈ డేటా సెంటర్‌లో Next Generation Zero Water Cooling సాంకేతికతను వినియోగించింది. ఈ టెక్నాలజీ ద్వారా నీటి వినియోగం లేకుండానే డేటా సెంటర్‌ను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.
‘భారత్‌ను AI ఫస్ట్ దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం’
మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ మాట్లాడుతూ.. “భారత్‌ను AI ఫస్ట్ దేశంగా తీర్చిదిద్దడం అంటే కేవలం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో భారత్ నాయకత్వం వహించేలా అవసరమైన సామర్థ్యం, డేటా భద్రత, సాంకేతిక నైపుణ్యాలను అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.
తొలి రోజే ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు
హైదరాబాద్ క్లౌడ్ రీజియన్ ప్రారంభమైన తొలి రోజే అదానీ గ్రూప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పీబీ పే సంస్థలు తమ కీలక ఐటీ అప్లికేషన్‌ల నిర్వహణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
