దిల్లీ(Delhi)లో శనివారం ఆకస్మికంగా వీచిన బలమైన గాలులు, కురిసిన భారీ వర్షం(heavy rain)
కారణంగా విమానాశ్రయంలో నిలిపి ఉంచిన మూడు ఎయిర్ ఇండియా(Air India) విమానాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లోని టెర్మినల్-2 వద్ద చోటుచేసుకుంది.

విమానాశ్రయ నిర్వాహక సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, టెర్మినల్-2 వద్ద పార్క్ చేసి ఉంచిన మూడు ఎయిర్ ఇండియా న్యారోబాడీ విమానాలను గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు ఢీకొన్నాయి. ఆకస్మికంగా వాతావరణం మారడంతో బలమైన గాలులకు ఈ పరికరాలు తమ స్థానాల నుంచి కదిలి విమానాలను తాకాయి.

ఈ గ్రౌండ్ సపోర్ట్ పరికరాలు ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ విభాగం, ఇండిగో సంస్థలకు చెందినవిగా అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం దెబ్బతిన్న మూడు విమానాలను తాత్కాలికంగా సేవల నుంచి ఉపసంహరించి సాంకేతిక తనిఖీలు చేపట్టారు.

ఈ ఘటనపై స్పందించిన విమానాశ్రయ నిర్వాహకులు, వాతావరణంలో మార్పులకు సంబంధించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి ముందస్తు హెచ్చరికలు అందలేదని పేర్కొన్నారు.

మరోవైపు, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారికంగా స్పందించేందుకు నిరాకరించింది. అయితే ఎయిర్‌లైన్ వర్గాల సమాచారం ప్రకారం, ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలతో పాటు ఇతర సంస్థలకు చెందిన కొన్ని విమానాలు కూడా ప్రతికూల వాతావరణ ప్రభావానికి గురయ్యాయి.

దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాల్లో రెండు త్వరలోనే మళ్లీ సేవల్లోకి వచ్చే అవకాశం ఉందని, మూడో విమానానికి మరింత మరమ్మతులు అవసరమవుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా చర్యలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి చర్చ మొదలైంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *