తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ (Vijay) రాజీనామా చేయడంతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక స్థానంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తరఫున ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్(Raghava Lawrence) బరిలో దిగే అవకాశముందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో లారెన్స్ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.


తన పోస్టులో రాఘవ లారెన్స్ రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. “నేను ఎప్పుడూ నిజాయితీగా నా బాధ్యతలను నిర్వర్తించాలని మాత్రమే అనుకున్నాను. ఒకరోజు రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా ఊహించలేదు. రాజకీయాల్లోకి రావాలనే కోరిక గానీ, దాని ద్వారా డబ్బు సంపాదించాలనే ఆశ గానీ, పెద్ద పదవులు పొందాలనే ఆకాంక్ష గానీ నాకు ఎప్పుడూ లేవని పేర్కొన్నారు.


తాను నమ్మిన వ్యక్తి, తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే, అతనికి మద్దతుగా నిలిచి ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలనే ఉద్దేశమే తనకు ఉందని లారెన్స్ తెలిపారు. వ్యక్తిగతంగా చేస్తున్న సేవా కార్యక్రమాల కంటే పెద్ద ఎత్తున సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు సాగానని, అయితే ప్రస్తుత పరిస్థితులు తనను రాజకీయాల్లోకి అడుగుపెట్టే దిశగా నడిపించాయని చెప్పారు.


రాజకీయాలపై తన ఆలోచనలు, అవి తన జీవితంలోకి ఎలా వచ్చాయనే అంశాలతో పాటు, రాజకీయాలపై తన తల్లి అభిప్రాయాలు, తన జీవిత ప్రయాణాన్ని ప్రభావితం చేసిన కొన్ని కీలక సంఘటనలను ఒక వీడియో ద్వారా పూర్తిగా నిజాయితీగా పంచుకున్నట్లు వెల్లడించారు.


అలాగే ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి కూడా చేశారు. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించాలని సూచించారు. తన వీడియోను వీక్షించిన తర్వాత ప్రజలు తమ విలువైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేయాలని కోరారు.


ప్రజలు రాజకీయాల్లోకి రావద్దని సూచిస్తే తాను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని, రాజకీయాలకు దూరంగా ఉంటూనే ఇప్పటివరకు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అయితే ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే, వారి ఆశీస్సులతో పాటు తాను నమ్మిన వ్యక్తులతో కలిసి కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. రాఘవ లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆయన రాజకీయ ప్రవేశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *