బీహార్లో యువతిపై బహిరంగ వేధింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లా జగత్సింగ్పూర్ గ్రామంలోని బంధ్ బైపాస్ రోడ్డులో జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం, పదో తరగతి చదువుతున్న ఓ యువతి తన స్నేహితుడితో కలిసి రోడ్డుపక్కన ఫోటోలు దిగుతుండగా కొందరు యువకులు ఆమెను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. వైరల్ వీడియోలో యువతి వివరాలు అడుగుతూ దుర్భాషలాడడం, ఆమెను బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు.
వీడియో వైరల్ అయిన వెంటనే సమస్తిపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో వికాస్ శర్మ, రాహుల్ కుమార్ అనే ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వికాస్ శర్మపై ఇప్పటికే పలు మద్యం సంబంధిత కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

