ఆంధ్రప్రదేశ్‌(Andra Pradesh)లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల కేటాయింపుపై ఎన్డీయే కూటమి నేతల మధ్య కీలక అవగాహన కుదిరింది. ఈ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒక స్థానం జనసేనకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన సీఎం క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madav), మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్(Palla Srinivas) పాల్గొన్నారు. రెండు గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనా విజయాలు, ఎస్‌ఐఆర్‌ అంశం, రాజ్యసభ స్థానాల కేటాయింపు వంటి విషయాలపై ప్రధానంగా చర్చించారు.

రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెదేపా, జనసేన పార్టీలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపా తరఫున రాజ్యసభకు ఎన్నికైన సానా సతీష్ పదవీకాలం త్వరలో ముగియనుంది. శాసనసభలో కూటమికి ఉన్న బలమైన మెజారిటీ కారణంగా ఈ నాలుగు స్థానాలు కూడా ఎన్డీయే కూటమికే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు పరస్పర అవగాహనతో స్థానాలను పంచుకున్నాయి.

ఇదిలా ఉండగా, గతంలో వైసీపీ(YCP) తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ నాలుగు ఖాళీల్లో రెండు స్థానాలను బీజేపీకి కేటాయించగా, మిగిలిన రెండు స్థానాలను తెదేపా తీసుకుంది.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *