క్రిప్టో మార్కెట్‌లో మళ్లీ బుల్ రన్ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ శనివారం ఉదయం భారీగా పుంజుకుని 78,588 డాలర్ల వద్ద ట్రేడైంది. గత 24 గంటల్లో దాదాపు 4.8% పెరగగా, కేవలం వారం రోజుల్లోనే 24.5% లాభపడింది. ఇది 2023 మార్చి తర్వాత బిట్‌కాయిన్‌కు నమోదైన అత్యంత బలమైన వారపు ర్యాలీగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బిట్‌కాయిన్ ఎందుకు ఒక్కసారిగా పెరిగింది?
మార్కెట్ విశ్లేషకుల ప్రకారం, అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్‌లను రెట్టింపు చేస్తామని ప్రకటించడం ఈ ర్యాలీకి ప్రధాన కారణం. దీంతో బాండ్ యీల్డ్‌లు తగ్గి, పెట్టుబడిదారులు మళ్లీ రిస్క్ అసెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాని ప్రభావం క్రిప్టో మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
షార్ట్ పొజిషన్లు లిక్విడేట్.. మరింత వేగం
బిట్‌కాయిన్ ధర పెరగడంతో పతనాన్ని అంచనా వేసి ట్రేడ్ చేసిన భారీ షార్ట్ పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి. దీనివల్ల కొనుగోలు ఒత్తిడి మరింత పెరిగి ధర వేగంగా పైకి ఎగబాకింది. ఇదే సమయంలో బంగారం కూడా మే నెల తర్వాత గరిష్ఠ స్థాయికి చేరడం మార్కెట్లలో రిస్క్, సేఫ్ హేవెన్ అసెట్స్ రెండింటిపైనా ఆసక్తి పెరిగిందని సూచిస్తోంది.
ట్రంప్ భేటీ, ETF ఇన్‌ఫ్లోలు కూడా బూస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో సంస్థల ప్రతినిధులతో సమావేశం కావడం మార్కెట్‌కు సానుకూల సంకేతంగా మారింది. మరోవైపు అమెరికాలో నమోదైన స్పాట్ బిట్‌కాయిన్ ETFల్లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ జోరందుకున్నాయి. ఈ వారం మాత్రమే 13 ETFల్లోకి 1 బిలియన్ డాలర్లకు పైగా నిధులు వచ్చినట్లు మార్కెట్ డేటా చెబుతోంది.
58 వేల నుంచి 80 వేల డాలర్ల దిశగా
2025 అక్టోబర్‌లో బిట్‌కాయిన్ 1,26,000 డాలర్ల ఆల్‌టైమ్ హైని తాకిన తర్వాత భారీ పతనం నమోదైంది. 2026 జూన్ చివర్లో 58,642 డాలర్ల వరకు పడిపోయిన బిట్‌కాయిన్, ఇప్పుడు మళ్లీ 80 వేల డాలర్ల మైలురాయికి చేరువగా దూసుకెళ్తోంది.

