మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఎదురెదురుగా ఢీకొన్న వాహనాలు, 8 మంది కూలీల దుర్మరణం!

మధ్యప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. భిండ్-గ్వాలియర్ జాతీయ రహదారిపై చిమ్కా గ్రామం సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 1 గంట సమయంలో) కూలీలతో వెళ్తున్న వాహనం ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన దుర్ఘటనలో 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

గ్వాలియర్‌లో వ్యవసాయ పనులు ముగించుకుని ఉత్తర్​ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీ ఉన్న తమ స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా అడ్డొచ్చిన పశువులను తప్పించే క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు గోహద్ చౌరాహా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామ్‌నరేశ్ యాదవ్ ప్రాథమిక విచారణలో వెల్లడించారు.

ప్రమాద ధాటికి కూలీల వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో అందులోని పలువురు క్షతగాత్రులు వాహనం లోపలే చిక్కుకుపోయారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

గాయపడిన 32 మందిని చికిత్స కోసం వెంటనే గోహద్‌లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *