ప్రముఖ నటి అవికా గోర్ తన సహ కంటెస్టెంట్ ఫర్హానా భట్‌కు క్షమాపణలు చెప్పింది. ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న ఓ ఉద్రిక్త పరిస్థితిపై అవికా స్పందించింది. ఆ సమయంలో తాను ప్రవర్తించిన తీరు తనకే నచ్చలేదని, తన అసహనాన్ని ఫర్హానాపై చూపించడం తప్పేనని అంగీకరించింది.
షోలో అవికా ఫర్హానా టీమ్‌లో చేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫర్హానా ఆమెను అభినందిస్తూ శుభాకాంక్షలు చెప్పింది. అయితే అప్పటికే అసహనంగా కనిపించిన అవికా.. ఫర్హానాతో కొంత కఠినంగా మాట్లాడింది. ‘‘నువ్వు నేను టీమ్‌లోకి రావాలని కోరుకోలేదు కదా’’ అంటూ స్పందించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అవికా.. తన ప్రవర్తనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. టీమ్ విషయంలో తాను అసంతృప్తిగా ఉండి, ఆ కోపాన్ని ఫర్హానాపై చూపించడం సరైంది కాదని పేర్కొంది.
‘‘నా ప్రవర్తన నాకు నిజంగా నచ్చలేదు. ఫర్హానా.. నన్ను క్షమించు. టీమ్ విషయంలో అసంతృప్తిగా ఉండి, ఆ భావోద్వేగాన్ని నీపై చూపించడం తప్పు అంటూ అవికా తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది.
మరో కామెంట్‌లోనూ అవికా తన తప్పును అంగీకరించింది. తాను అలా ప్రవర్తించడం సరైంది కాదని, ఆ సమయంలో ఉన్న అసహనం ఫర్హానాపై బయటపడిందని చెప్పింది.
ఇక ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ 15వ సీజన్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. గౌరవ్ ఖన్నా, అవినాష్ మిశ్రా, ఫర్హానా భట్, షగున్ శర్మ, అవికా గోర్, ఓర్హాన్ అవత్రామణి (ఓరీ), హర్ష్ గుజ్రాల్, జాస్మిన్ భాసిన్, రుబీనా దిలైక్, కరణ్ వాహి, రిత్విక్ ధంజాని, రుహానికా ధావన్, విశాల్ ఆదిత్య సింగ్ తదితరులు ఈ సీజన్లో కనిపిస్తున్నారు.
ముఖ్యంగా గత సీజన్లలో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్లు తిరిగి రావడం ఈ సీజన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవికా గోర్, జాస్మిన్ భాసిన్, కరణ్ వాహి, రిత్విక్ ధంజాని, రుబీనా దిలైక్, విశాల్ ఆదిత్య సింగ్ వంటి మాజీ కంటెస్టెంట్లు మరోసారి స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు.

