తెలంగాణపై తనకు ఉన్న ప్రేమ రాజకీయాలకు అతీతమైందని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు తనకు ఎన్నోసార్లు అండగా నిలిచారని గుర్తు చేస్తూ, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై వస్తున్న విమర్శలు, బెదిరింపులపై తీవ్రంగా స్పందించారు.

బెదిరింపులు కొత్తేమీ కాదు

కొంతమంది తనను ఉద్దేశిస్తూ “హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావు? ఇక్కడ నీకేం పని?” అని ప్రశ్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నన్ను బెదిరించడానికి మీరెవరయ్యా? ఇది ఎవరి జాగీరు? నేను భయపడే వాడిని కాదని ధ్వజమెత్తారు. తనకు బెదిరింపులు ఎక్కువగా తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని వ్యాఖ్యానించిన ఆయన, తెలంగాణ యువతకు మంచి అవకాశాలు రావాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. తన ఇంటి వద్దే ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక తన అడ్రస్ తెలియజేయడమే ఉద్దేశమని చెప్పారు. వారాహి వాహనానికి అనుమతి తెలంగాణ ప్రజలే ఇచ్చారని, జనసేనను తెలంగాణ నడిబొడ్డునే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

“అధికారంపై ప్రేమ లేదు… మార్పుపైనే ప్రేమ”

తెలంగాణలో పార్టీ బలోపేతంపై తమ నేతలు చాలాసార్లు సూచనలు చేశారని ఆయన చెప్పారు. అయితే తాను అధికారాన్ని కోరుకునే వ్యక్తిని కాదని, ఆంధ్రప్రదేశ్‌లోనే అధికారం కోరుకోనప్పుడు తెలంగాణలో ఎందుకు కోరుకుంటానని ప్రశ్నించారు. తనకు అధికారంపై ప్రేమ లేదని, మార్పుపైనే ఆసక్తి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రులపై ద్వేషం లేదని, ఉంటే ఏపీకి చెందిన ఒక్కరు కూడా ఇక్కడ ఉండలేరని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ అంతటా తిరిగిన వ్యక్తినని, విమర్శించే వారు ఆదిలాబాద్ అడవుల్లో కూడా తిరగలేదని అన్నారు.

బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు ”

తాను తెలంగాణకు వ్యతిరేకి కాదని, విభజన జరిగిన విధానానికే వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం తాను ముందునుంచే మాట్లాడానని గుర్తు చేశారు. పార్లమెంటు తలుపులు మూసి విభజన చేసిన తీరును తప్పుపట్టానని చెప్పారు. “నేను ఇప్పటివరకు ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా తప్పుగా మాట్లాడలేదు. కానీ నన్ను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు” అని ఆయన ఆరోపించారు. గద్దర్ ప్రస్తావన తీసుకువచ్చి, ఆయన జీవించి ఉన్నప్పుడు సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ విశ్లేషకుడి వ్యాఖ్యల వల్లే సమస్యలు మొదలయ్యాయని, ఆయనపై కేసులు ఉన్న విషయం తనకు ముందుగా తెలియదని, తెలిసిన వెంటనే కేసులు వద్దని చెప్పానని తెలిపారు.

కబ్జా ఆరోపణలపై సవాల్

తనపై వస్తున్న భూమి కబ్జా ఆరోపణలపై స్పందిస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. “నేను కబ్జా చేశానని నిరూపిస్తే ఆ భూమిని ప్రభుత్వానికి రాసిచ్చేస్తా అని స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి కారణంగానే సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిందని, హైదరాబాద్ 50 ఏళ్లు తెలుగు ప్రజల ఉమ్మడి రాజధానిగా ఉందని గుర్తు చేశారు. పాలకులను విమర్శించాలి కానీ ప్రజలను కాదు అని అన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన వారిని శిక్షించినా తప్పులేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో పోటీపై కీలక ప్రకటన

ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెబుతూ, తెలంగాణలో జనసేన తప్పకుండా ఉంటుందని, అవసరమైతే తానే రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. “ప్రతి సమస్యపై మాట్లాడతాం, ప్రతి అన్యాయానికి ఎదురుతిరుగుతామని చెప్పారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, తనను బెదిరిస్తే భయపడబోనని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే ఇప్పుడు పదవుల్లో ఉన్నారని కూడా వ్యాఖ్యానించారు. చివరగా, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని, రాష్ట్రంలో తాను విస్తృతంగా పర్యటిస్తానని మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *