దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా దేశభక్తిని చాటిచెప్పే ఎన్నో తెలుగు సినిమాలు, పాటలు మరోసారి గుర్తుకొస్తున్నాయి. దేశభక్తి గీతాలు అనగానే ముందుగా గుర్తొచ్చే పాటల్లో ‘పుణ్యభూమి నా దేశం’ ఒకటి. ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ఈ పాట ప్రతి తెలుగువాడిలో దేశభక్తిని రగిలిస్తుంది.
అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలోని ‘మేమే ఇండియన్స్’, టైటిల్ సాంగ్ కూడా దేశభక్తిని పెంచేలా ఉంటాయి. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.
సూపర్‌స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు కూడా తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకమైన దేశభక్తి చిత్రంగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని చూపించిన ఈ సినిమాలోని ‘తెలుగు వీర లేవరా’ పాట ఇప్పటికీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.
ఇక నవదీప్ నటించిన జై సినిమాలోని ‘దేశం మనదే.. తేజం మనదే’, మంచు మనోజ్ ఝుమ్మంది నాదంలోని ‘దేశమంటే మట్టి కాదోయ్’, చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్లోని ‘ఓ బాపు నువ్వే రావాలి’ పాటలు కూడా దేశభక్తి భావాన్ని పెంచుతాయి.
మహాత్మ సినిమాలోని ‘ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ’, చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలోని దేశభక్తి గీతాలు, ఆర్ఆర్ఆర్లోని ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా’ వంటి పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇలా టాలీవుడ్‌లో దేశభక్తిని ప్రతిబింబించే ఎన్నో సినిమాలు, పాటలు ఉన్నాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వీటిని మరోసారి చూస్తే దేశభక్తి భావన మరింత ఉప్పొంగడం ఖాయం!
