కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులకు కీలక సూచన చేశారు. సోషల్ మీడియాలో జరిగే అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని, నెగిటివ్ పోస్టులకు స్పందిస్తూ విలువైన సమయాన్ని, శక్తిని వృథా చేసుకోవద్దని సూచించారు. ఇటీవల అభిమాన సంఘాల సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
‘విమర్శలకు సమాధానం చెప్పొద్దు’
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఎవరో ఏదైనా పోస్ట్ చేశారని, దానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు.
“సోషల్ మీడియాలో ఎవరో ఏదో పోస్ట్ చేశారని.. దానికి బదులిస్తే మనకీ వాళ్లకీ తేడా ఉండదు. మన పని మనం చేసుకుందాం.. వాళ్లను వాళ్లలాగే ఉండనిద్దాం.”
ఎదుటివారిని మార్చడం చాలా కష్టమని, విమర్శలకు సమాధానం చెబుతూ తమ శక్తిని వృథా చేసుకోవద్దని అభిమానులకు హితవు పలికారు. తాము కేవలం ప్రేమను పంచుతూ, ప్రతిరోజూ చేసే పనిపై దృష్టి పెడితే విజయం సాధించగలమని సూచించారు.
సూర్య అభిమానుల్లో చర్చకు కారణమేంటి
ఇటీవల హీరో శివకార్తికేయన్ ‘సర్దార్ 2’, ‘మండాడి’ చిత్ర బృందాలను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ పోస్టులు సూర్య అభిమానుల్లో భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. దీంతో నెట్టింట కొంతకాలంగా జరుగుతున్న చర్చల నేపథ్యంలోనే సూర్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు.
అయితే, ఈ సందర్భంగా సూర్య ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించలేదు. సాధారణంగా సోషల్ మీడియాలో జరిగే వివాదాలకు అభిమానులు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
వరుస సినిమాలతో సూర్య బిజీ
సినిమాల విషయానికొస్తే.. సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. తదుపరి ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తదుపరి చిత్రం ‘సీన్’. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలో విడుదల కానున్నట్లు సమాచారం.

