నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాను రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? వైసీపీకి ఎందుకు దూరమయ్యారు? అనే విషయాలపై ఓ ఇంటర్వ్యూలో అలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి. అలీ 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవి కూడా దక్కింది. ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేసిన అలీ.. ఆ తర్వాత కూడా కొంతకాలం రాజకీయాల్లో కొనసాగారు. అయితే తనకు తగిన గుర్తింపు లభించలేదనే అసంతృప్తితో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు 2024లో ఆయన వైసీపీకి దూరమయ్యారు.
తాజాగా తన రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడిన అలీ.. తాను మొదటినుంచీ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని స్పష్టం చేశారు. అనుకోని పరిస్థితుల్లోనే రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఎలాంటి పదవి లేదా వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా వైసీపీలో చేరానని చెప్పారు. “ఏదైనా ఆశించి ఉంటే ఒకటి, రెండేళ్లలోనే పార్టీని వీడి ఉండేవాడిని” అని అలీ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో తన సినిమాల పనులను పక్కన పెట్టి పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశానని గుర్తుచేశారు. పార్టీ కోసం తాను చేసిన కృషి ప్రజలకు కూడా తెలుసని అన్నారు.
అయితే తాను చేసిన కృషికి తగిన గుర్తింపు మాత్రం లభించలేదనే అసంతృప్తిని అలీ వ్యక్తం చేశారు. “ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేస్తే ఏ మనిషికైనా బాధగా ఉంటుంది కదా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇదే సందర్భంలో తన పరిస్థితిని వివరిస్తూ అలీ చేసిన ‘కరివేపాకులా తీసి పారేశారు’ అనే వ్యాఖ్య కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉపయోగించుకుని, ఆ తర్వాత గుర్తింపు లేకుండా పక్కన పెట్టడం తనను బాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.
