కేరళలో అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. బీసీసీఐ సహకారంతో ఎర్నాకులం జిల్లాలో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కేరళలో క్రికెట్ మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి. ఆలువ తాలూకాలోని చెంగమనాడు గ్రామంలో నెడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న 10.1312 హెక్టార్ల భూమిని ఇతర అవసరాలకు మార్చేందుకు వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది. కేరళ పాడి భూమి, చిత్తడి నేలల పరిరక్షణ చట్టం-2008లోని సెక్షన్ 10(2) కింద ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేరళ స్పోర్ట్స్ పాలసీ-2023, కేరళ స్పోర్ట్స్ యాక్ట్-2025, కేరళ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ స్కీమ్-2025 కింద ఈ ప్రాజెక్ట్‌ను ‘ప్రజా ప్రయోజనం’గా ప్రభుత్వం గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణకు సంబంధించిన పలు నిబంధనలను కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) గత ప్రభుత్వ హయాంలోనే దరఖాస్తు చేసింది. రాష్ట్రస్థాయి కమిటీ భూమి రీక్లాసిఫికేషన్‌కు సిఫారసు చేసినప్పటికీ.. కొన్ని న్యాయ, సాంకేతిక సమస్యల కారణంగా అనుమతులు ఆలస్యమయ్యాయి.

తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చట్టపరమైన మార్పులు చేపట్టారు. అనంతరం ప్రాజెక్ట్‌ను ‘ప్రజా ప్రయోజనం’గా గుర్తించడంతో పాటు కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కింద KCAకి మినహాయింపు కూడా లభించింది. ప్రస్తుత ప్రభుత్వం మిగిలిన ప్రక్రియలను వేగవంతం చేయడంతో రాష్ట్రస్థాయి కమిటీ మరోసారి KCA దరఖాస్తును పరిశీలించి.. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం భూమి రీక్లాసిఫికేషన్‌కు సిఫారసు చేసింది. ఈ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.

రూ.450 కోట్లతో స్పోర్ట్స్ సిటీ

ఈ అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.450 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐదేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టేడియం చుట్టూ భారీ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలని KCA ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఇండోర్ స్టేడియం, ట్రైనింగ్ గ్రౌండ్, స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ రీసెర్చ్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్, క్లబ్‌హౌస్, హోటల్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.

కోచిలో చివరిసారిగా 2014లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. కొత్త స్టేడియం అందుబాటులోకి వస్తే కేరళలో అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు మరింత అవకాశం లభించనుంది. KCA అధ్యక్షుడు అడ్వొకేట్ శ్రీజిత్ వి. నాయర్ మాట్లాడుతూ.. ఇది కేరళ క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిలో కీలక నిర్ణయమని అన్నారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఈ స్టేడియం క్రికెటర్లు, అభిమానులకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా స్పోర్ట్స్ టూరిజం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీసీసీఐ అధికారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులు త్వరలో ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించనున్నట్లు BCCI WPL చైర్మన్, మాజీ KCA అధ్యక్షుడు జయేష్ జార్జ్ తెలిపారు. గతంలో కేరళలో జరిగిన IPL వేలం సందర్భంగా ICC చైర్మన్ జై షా కూడా ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించి తదుపరి చర్యలపై సూచనలు చేసినట్లు ఆయన వెల్లడించారు.

KCA కార్యదర్శి వినోద్ ఎస్. కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా స్థిరమైన, ప్రపంచ స్థాయి స్టేడియం కేరళకు అందించడమే లక్ష్యమన్నారు. క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కూడా ఇందులో సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.

By Mamatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *