మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ అభిమానులకు షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరగాల్సిన ఆయన భారీ షో వీసా సమస్య కారణంగా వాయిదా పడింది. మోహన్‌లాల్‌కు ఆస్ట్రేలియా వీసా రాకపోవడంతో ఆయన సిడ్నీకి వెళ్లలేకపోయారు. దీంతో ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న ఇతర కళాకారులు ఉన్నప్పటికీ.. కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ విషయంపై మోహన్‌లాల్ నిర్వాహకులకు వీడియో సందేశం పంపారు. తనకు వీసా ఎందుకు రాలేదో తెలియడం లేదని.. అది సాంకేతిక సమస్యా, అధికారిక ప్రక్రియలో జరిగిన పొరపాటా అనే విషయాల్లోకి తాను వెళ్లదలచుకోలేదని చెప్పారు. ఈ పరిస్థితికి తానే బాధ్యత వహిస్తున్నానని పేర్కొంటూ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. తాను ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నానని, సమయానికి వీసా వస్తుందని భావించానని మోహన్‌లాల్ తెలిపారు. కానీ చివరకు వీసా రాకపోవడంతో సిడ్నీ షోకు హాజరుకాలేకపోయానని చెప్పారు.
“నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే తొలిసారి. నేను చాలా బాధగా ఉన్నాను. నాతో పాటు రావాల్సిన టీమ్‌లోని అందరూ అక్కడికి చేరుకున్నారు. కేఎస్ చిత్రతో పాటు నా టీమ్ సభ్యులంతా అక్కడే ఉన్నారు. కానీ నేను మాత్రం రాలేకపోయాను” అని మోహన్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన నటుడిగా తాను ఎన్నో కార్యక్రమాలు చేశానని, సిడ్నీ ప్రేక్షకుల కోసం అత్యుత్తమ కాన్సెప్ట్‌తో కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించానని చెప్పారు. ఈ పరిస్థితి తనకు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు.
షో కోసం దూర ప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. అభిమానులను నిరాశపరిచినందుకు చింతిస్తున్నానని.. అదే టీమ్‌తో తిరిగి ఆస్ట్రేలియాకు వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయితే కొత్త షో తేదీ ఇంకా ఖరారు కాలేదని మోహన్‌లాల్ తెలిపారు. అందరి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త తేదీని నిర్ణయిస్తామని చెప్పారు. చివరగా అభిమానుల పరిస్థితిని అర్థం చేసుకుని తన క్షమాపణను స్వీకరించాలని కోరారు.
