జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి గొప్ప గుర్తింపుగా నిలిచిన చేనేత సంప్రదాయాన్ని, తరతరాలుగా దాన్ని పరిరక్షిస్తున్న నేత కార్మికులు, కళాకారుల సేవలను ఆయన కొనియాడారు.

సోషల్ మీడియా వేదిక ‘X’లో చేసిన పోస్టులో మోదీ మాట్లాడుతూ.. “జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతదేశ గొప్ప చేనేత వారసత్వాన్ని మనమంతా గర్వంగా జరుపుకుందాం. మన సంప్రదాయాలను సజీవంగా ఉంచిన నేత కార్మికులు, కళాకారుల నైపుణ్యానికి, అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నామని పేర్కొన్నారు.

చేనేత రంగం గ్రామీణాభివృద్ధి, మహిళల సాధికారత, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ అన్నారు. ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు.

అలాగే ప్రతి ఒక్కరూ కనీసం ఒక చేనేత ఉత్పత్తిని కొనుగోలు చేయాలని, తాము ధరించిన చేనేత వస్త్రాలతో GRWM (Get Ready With Me) వీడియోలను #NationalHandloomDay హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఇలా చేయడం ద్వారా నేత కార్మికులకు ప్రోత్సాహం లభించడంతో పాటు వారి జీవనోపాధికి బలం చేకూరుతుందని తెలిపారు. ఆగస్టు 7, 1905న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం భారత స్వావలంబనకు బాటలు వేసిందని గుర్తు చేసిన ప్రధాని, ఆ ఉద్యమ స్ఫూర్తినే కొనసాగిస్తూ చేనేత ఉత్పత్తులను ఆదరించాలని యువతకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *